భారత్ పై పాక్ దాడికి 'నవాజ్'యే కుట్రదారు?
"పాకిస్థాన్‌ను అణుశక్తిగా మార్చిన నవాజ్ షరీఫ్.. ఇప్పుడు భారత్‌పై మొత్తం ఆపరేషన్‌ను రూపకల్పన చేశారు.;
భారత ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా పాకిస్థాన్ చేపట్టిన సైనిక చర్యలు మాజీ ప్రధాని, అధికార పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే జరిగాయని పాకిస్థాన్‌లోని పంజాబ్ సమాచార శాఖ మంత్రి అజ్మా బుఖారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడులకు భారత్ 'ఆపరేషన్ సిందూర్'తో దీటుగా బదులిచ్చిన నేపథ్యంలో పాక్ భారత పౌరులపై డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో అజ్మా బుఖారీ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో నవాజ్ షరీఫ్ ప్రభావాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చాయి.
"పాకిస్థాన్‌ను అణుశక్తిగా మార్చిన నవాజ్ షరీఫ్.. ఇప్పుడు భారత్‌పై మొత్తం ఆపరేషన్‌ను రూపకల్పన చేశారు. ఇది మొత్తం ఆయన కనుసన్నల్లోనే రూపొందించారు" అని అజ్మా బుఖారీ పేర్కొన్నట్లు పలు మీడియా వర్గాలు వెల్లడించాయి. నవాజ్ షరీఫ్ సాధారణ నేత కాదని, ఏదైనా చేసి చూపించే తత్వం ఆయనలో ఉందని ఆమె కితాబిచ్చారు. ఒకవేళ ఆమె వ్యాఖ్యలు నిజమైతే, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం, సైన్యంపై కూడా నవాజ్ షరీఫ్ ఆధిపత్యం కొనసాగుతోందని స్పష్టమవుతోంది.
భారత్ 'ఆపరేషన్ సిందూర్'ను విజయవంతంగా పూర్తి చేసిన మరుసటి రోజు ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆసక్తికరమైన విషయం ఏటంటే, ప్రభుత్వంలో ఎటువంటి అధికారిక పదవిలో లేనప్పటికీ, అధికార పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) అధ్యక్షుడి హోదాలో నవాజ్ షరీఫ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్‌తో దూకుడు తగదని, కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే శాంతిని పునరుద్ధరించుకోవాలని ఆయన సూచించినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అప్పటికే న్యూదిల్లీతో ఆయన తెర వెనక చర్చలు ప్రారంభించినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇటీవల ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన వెంటనే, ఇరు దేశాల నేతలు, సైనికాధికారులను నవాజ్ షరీఫ్ అభినందించడం గమనార్హం.
పాకిస్థాన్‌కు మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు సోదరుడు. 1999లో కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో కూడా నవాజ్ షరీఫ్ పాకిస్థాన్‌కు ప్రధానిగా ఉన్నారు. అజ్మా బుఖారీ వ్యాఖ్యలు, కీలక సమావేశంలో ఆయన భాగస్వామ్యం పాకిస్థాన్ రాజకీయాలు, సైనిక వ్యవహారాలలో నవాజ్ షరీఫ్‌కున్న పట్టును చాటిచెబుతున్నాయి.