'యుద్ధం రొమాంటిక్ గా ఉండదు'.. మాజీ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

ఈ క్ర‌మంలో తాజాగా ఆర్మీ మాజీ చీఫ్(ఈయ‌న హ‌యాంలోనే స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ జ‌రిగాయి) జ‌న‌ర‌ల్ మ‌నోజ్ న‌ర‌వాణే స్పందించారు.;

Update: 2025-05-12 09:38 GMT

గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు భారత్ - పాక్ మధ్య నెలకొన్న వేళ.. వాటిని తగ్గించేందుకు ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయంలో పాక్ లో పరిస్థితి సంగతి కాసేపు పక్కనపెడితే... భారత్ లో మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తోంది! ఇంకా ఎంతకాలం ఇలా అమాయకులైన పౌరులను (పాక్) ఉగ్రవాదులకు బలిద్దాం అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

అయితే... ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగిసిపోలేదు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ సహా, ఉగ్రవాదులను భారత్ కు అప్పగించడం మినహా పాకిస్థాన్ తో ఇంక మాట్లాడటానికి ఏమీ లేదు అనే కామెంట్లు భారత ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ సమయంలో భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... భారత్-పాక్ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు వ్యతిరేకత ఎదురవుతున్న వేళ భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే స్పందించారు. ఇందులో భాగంగా.. యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదని.. యుద్ధం రొమాంటిక్ గా ఉండదని.. ఎన్నో కుటుంబాలు తమ వారిని కోల్పోవాల్సి వస్తుందని అన్నారు.

తాజాగా పూణెలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నరవణే... యుద్ధం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే పౌరుల పరిస్థితి దారుణంగా ఉంటుందని.. షెల్లింగ్ ను చూడగానే చిన్న పిల్లౌ సైతం రాత్రి పూట సురక్షిత ప్రాంతాలకు పరుగెత్తాల్సి వస్తుందని.. ఈ పరిస్థితుల్లో తమ ప్రియమైన వారిని కోల్పోతే ఆ ఆవేదన తరతరాలు వెంటాడుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా... ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి ఎందుకు వెళ్లడం లేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారని.. సైన్యంలో పని చేసిన వ్యక్తిగా తాను యుద్ధానికి వెళ్లేందుకు సిద్ధమే కానీ.. దౌత్యాన్ని తొలి అవకాశంగా ఎంచుకోవాలని.. ప్రధాని నరేంద్ర మోడీ ఇది యుద్ధాల శకం కాదని చెప్పారని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలోనే యుద్ధం అంత రొమాంటిక్ గా ఉండదని.. ఇదేమీ బాలీవుడ్ సినిమా కాదని.. చాలా తీవ్రమైన అంశమని.. అది మనం ఎంచుకునే చివరి ఆప్షన్ అయ్యి ఉండాలని.. చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే తెలిపారు.

Tags:    

Similar News