పనిచేసిన చేతబడి ప్రచారం..!! భయంతో రూ.19 లక్షలు రిటన్ చేసిన దొంగ
మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో కానీ, మంత్రాలు వేయిస్తాం, దొంగను పట్టేస్తాం అన్న ప్రచారానికి ఒక దొంగ మాత్రం హడలిపోయాడు.
మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో కానీ, మంత్రాలు వేయిస్తాం, దొంగను పట్టేస్తాం అన్న ప్రచారానికి ఒక దొంగ మాత్రం హడలిపోయాడు. రెండు వారాల క్రితం దొంగతనం చేసిన నిందితుడు, బాధితులు చేతబడి చేయిస్తే తన ఆచూకీ తెలిసిపోతుందనే భయంతో రూ.19 లక్షల నగదును తిరిగి ఇచ్చేశాడు. అంతేకాకుండా తన వాటా డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నానని, తన పాటనర్ల సమాచారం మాత్రం అడగొద్దని, చేతబడి చేయొద్దు అంటూ వేడుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
పల్నాడు జిల్లా కేంద్రం నరసారావుపేటలో గత నెల 30న జరిగిన చోరీ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఘటన జరిగి రెండు వారాలు అయినా నిందితుల ఆచూకీ లేకపోయినప్పటికీ, దొంగ మాత్రం స్వచ్ఛందంగా రూ.19 లక్షల నగదును బాధితులకు తిరిగి ఇచ్చేసి ఆశ్చర్యపరిచాడు. ఇలా దొంగ తాను చోరీ చేసిన డబ్బును వెనక్కి ఇవ్వడానికి ప్రధాన కారణం దొరికిపోతాననే భయమేనని అంటున్నారు. తన ఆచూకీ తెలుసుకోడానికి బాధితులు చేతబడి చేయిస్తున్నారని విస్తృతంగా జరిగిన ప్రచారంతో దొంగ భయపడ్డాడని, చోరీచేసిన డబ్బును గుట్టుచప్పుడు కాకుండా బాధితుల ఇంటి ముద్దు పెట్టాడని చెబుతున్నారు. అంతేకాకుండా డబ్బుతోపాటు ఒక లేఖను రాసిన దొంగ తనను ఇక్కడితో వదిలేయాలని వేడుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
నరసారావుపేటలోని ప్రకాశ్ నగర్ బాలాజీ ఆర్కేడ్ అపార్టమెంటులో నివాసం ఉంటున్న ఆదినారాయణరెడ్డి, కోటేశ్వరమ్మ దంపతులు గత నెల 30న సమీమ బంధువు మరణించారని తెలిసి రొంపిచర్ల మండలంలోని కొత్తపల్లి గ్రామానికి వెళ్లారని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న దొంగలు ఆ రోజు రాత్రి ఇంట్లో చొరబడి రూ.25 లక్షల నగదు, 317 గ్రాముల బంగారంతో ఉడాయించారు. ఆదినారాయణరెడ్డి దంపతులు మరునాడు ఇంటికి వచ్చి చూసిన తర్వాత దోపిడీ విషయం వెలుగుచూసింది. వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలిలో ఆధారాలు సేకరించారు. దొంగల వేలిముద్రలతోపాటు సీసీ పుటేజీ సేకరించాలని భావించారు. అయితే అపార్టమెంటులో సీసీటీవీ పుటేజీలో దొంగల ఆచూకీ లభ్యం కాకపోవడం, ఆదినారాయణరెడ్డి ఇంట్లో ఎవరూ లేరన్న పక్కా సమాచారంతోనే దొంగతనం జరిగినట్లు భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఘటన జరిగి సుమారు 15 రోజులు అవుతున్నా ఎటువంటి పురోగతి లేకపోవడంతో బాధితులు తమ సొత్తు ఎలా పోయిందో తెలుసుకోవాలని అంజనం వేయించాలని భావించారని అంటున్నారు.
ఈ విషయంపై పట్టణంలో విస్తృతంగా ప్రచారం జరగడంతో శనివారం ఉదయం ఆదినారాయణరెడ్డి ఇంటి ముందు చెప్పుల స్టాండులో రూ.19 లక్షల నగదుతో ఒక బ్యాగు కనిపించిందని చెబుతున్నారు. ఆ బ్యాగులో డబ్బుతోపాటు ఒక లేఖ కూడా ఉంది. తాను చేసిన పొరపాటును తెలియజేసిన దొంగ తన వాటా రూ.19 లక్షలు తిరిగి ఇచ్చేస్తున్నానని, మిగతా డబ్బు విషయంపై మాత్రం తనను అడగొద్దని ప్రాధేయపడ్డాడు. అంతేకాకుండా చేతబడి చేయొద్దని వేడుకున్నాడు. దీంతో పోలీసులకు భయపడని దొంగ, చేతబడి ప్రచారంతో హడలిపోయాడని భావిస్తున్నారు. అయితే డబ్బుతో బ్యాగు దొరికిన విషయాన్ని బాధితులు పోలీసులకు తెలియజేయడంతో దొంగతనం తెలిసిన వారి పనే అయివుంటుందని అనుమానిస్తున్నారు. ఇక ఇటీవల ఇటువంటి ఘటన తునిలో కూడా జరిగిందని చెబుతున్నారు. దొంగతనం చేసిన దుండగులు గ్రామపెద్దలు వెలివేస్తారనే భయంతో చోరీ సొత్తును బాధితుల ఇంటి ముందు పారేసి వెళ్లిపోయారని చెబుతున్నారు.