అయ్యో.. దీదీ: ఇది కదా 'ఖర్మ' అంటే!
కాలం కలిసి వచ్చినంత వరకు తమకు తిరుగులేదనే తత్వం కొందరు నాయకుల్లో బల పడుతుంది.
కాలం కలిసి వచ్చినంత వరకు తమకు తిరుగులేదనే తత్వం కొందరు నాయకుల్లో బల పడుతుంది. కానీ, ఆ కాలమే ఎదురు తిరుగుతుందని.. అప్పుడు తమ పరిస్థితి ఏంటనేది చాలా మంది ఆలోచన చేయరు. ఇలాంటి వారిలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒకరు. రాజకీయాల్లో ఎలా ఉండకూడదో.. చెప్పడానికి మమత ప్రధాన ఉదాహరణ అని జాతీయ మీడియా ఎద్దేవా చేస్తోంది. దీదీగా ఎంతో ప్రేమతో పిలుచుకునే మమతా బెనర్జీ.. పశ్చిమ బెంగాల్‌ను 15 సంవత్సరాల పాటు పాలించారు.
కానీ, కాలం అన్ని వేళలా కలిసిరాదు. ఈ విషయం గ్రహించలేక పోయారు. దీంతో అధికారంలో ఉనప్పుడు.. ఆమె అందరినీ తక్కువగా చూశారన్నది వాస్తవం. కాంగ్రెస్ కూటమిపైనా ఆమె విమర్శలు చేశారు. అసలు కూటమి ఉందా? అంటూ.. ఎద్దేవా చేశారు. ``పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ లేదు.`` అని ఏడాది కిందట అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు జాతీయ మీడియా గుర్తు చేసే పరిస్తితి వచ్చింది. దీనికికారణం.. ఏ కాంగ్రెస్‌ను అయితే.. ఆమె చులకన చేసి మాట్లాడారో.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌ముందు చేతులు కట్టుకుని బిక్కమొహం వేస్తూ నిలబడే పరిస్థితి వచ్చింది.
''మీరంతా సోనియా సోనియా అంటూ పూజలు చేస్తున్నారు. అసలు ఆమె మన పౌరురాలు కాదు'' అని ఎన్నికల సభల్లో నొక్కి వక్కాణించిన మమతా బెనర్జీ.. అదే సోనియా ముందు బేలగా నిలబడ్డ ఫొటో(పైచిత్రంలో) ఇప్పుడు జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ నాయకులు కూడా దీనిని వైరల్ చేస్తున్నారు. దీనికికారణం.. ఇప్పుడు మమత ఉన్న పరిస్థితి.. నాటి పరిస్థితికి చాలా భిన్నం. అధికారంలో ఉంటే.. అంతా తన ఇష్టం అన్నట్టుగా వ్యవహరించిన మమత.. బీజేపీ దెబ్బతో సొంత పార్టీ జెండా, అజెండా, గుర్తు కూడా కోల్పోయే దారుణ పరిస్థితికి చేరిపోయారు.
ఇప్పుడు మమతను పలకరించే `నా` అన్న ఆదరువు కూడా లేకుండా పోయింది. సొంత పార్టీ తరఫున గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు.. బీజేపీ పక్షానికి మద్దతుగా మారి.. వీరిలో 54 మంది తమదే తృణమూల్ పార్టీ, జెండా అజెండా అన్నీ తమవేనని భీష్మించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం మరో వారంలో నిర్ణయం తీసుకుంటుంది. ఇక, ఈ నిర్ణయం ఎలా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పుడు తనకు మద్దతుగా నిలిచే వారి కోసం మమత ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కూటమి సమావేశానికి అందరికన్నా ముందు వచ్చారు. సోనియా ముందు .. ఇలా నిలబడ్డారు(పైచిత్రం). ఇప్పుడు మమతలో ఎక్కడా నాటి గర్వం లేదు.. ఒక్క బేల చూపులు.. అధైర్యం తప్ప!!. అందుకే.. అధికారంలో ఉన్నప్పుడు.. ఎంత జాగ్రత్తగా ఉండాలో మమతను చూసి నేర్చుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. పాపం ఎదురు చెప్పే పరిస్థితి కూడా మమతకు లేకపోవడం గమనార్హం.