బాల్ కొడితే ‘అస్సామే’.. గౌహతీలో ఏకంగా 4 సెంచరీలు.. గిల్ డబుల్ సెంచరీ, 406 చేధించి భారత్ పెను సంచలనం
గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు సరికొత్త రికార్డుల పరంపరను సృష్టించింది.
గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు సరికొత్త రికార్డుల పరంపరను సృష్టించింది. విండీస్ నిర్దేశించిన 406 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్ క్రికెట్ లో టీమిండియా పెను సంచలనం సృష్టించింది.. ఈ మ్యాచ్ లో బ్యాటర్లు చెలరేగిపోయారు. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ బ్యాటర్లు క్యాంప్ బెల్ 101, కెప్టెన్ షాయ్ హోప్ 104, జంగో 114 ముగ్గురు సెంచరీలతో నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగుల భారీ స్కోరును చేసింది. ఇక ఛేదన మనోళ్లు చేస్తారా? ఇంత భారీ స్కోరు సాధ్యమవుతుందా? అని కంగారుపడ్డ భారత అభిమానులకు ఓవైపు రోహిత్ సెంచరీ, మరో వైపు కెప్టెన్ గిల్ డబుల్ సెంచరీతో దంచి కొట్టడంతో కొండంత అసాధ్యమనుకున్న లక్ష్యం సుసాధ్యమైపోయింది. ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ డబుల్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సాధించిన విధ్వంసకర శతకాలతో భారత జట్టు పరుగుల సునామీ సృష్టించి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు కలలో కూడా ఊహించని రీతిలో ఆరంభాన్ని ఇచ్చారు. మొదట్లో కాస్త ఆచితూచి ఆడినప్పటికీ ఆరో ఓవర్ నుంచి ఇద్దరూ గేర్ మార్చారు. ఆరో ఓవర్‌లో 11, ఏడో ఓవర్‌లో 12, ఎనిమిదో ఓవర్‌లో 17 పరుగులు.. ఇలా వరుసగా గేర్లు మార్చుతూ ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోతూ వెస్టిండీస్ బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పెంచారు. క్రీజు నలుమూలలా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో పరిగెత్తింది.
ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పలు అరుదైన మైలురాళ్లను అందుకున్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒకే దేశంలో 2 వేల వన్డే పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 33 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి వెస్టిండీస్ దిగ్గజం డెస్మాండ్ హేన్స్ పేరిట ఉన్న 36 ఇన్నింగ్స్ రికార్డును తిరగరాశాడు. గిల్ కేవలం 133 బంతుల్లోనే 223 పరుగులతో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
మరోవైపు రోహిత్ శర్మ కూడా తన మార్కు విధ్వంసాన్ని కొనసాగించాడు. కేవలం 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. తన కెరీర్‌లో 63వ వన్డే అర్ధశతకాన్ని నమోదు చేయడమే కాకుండా భారత గడ్డపై వన్డేల్లో 200 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఆ తర్వాత ధాటిగా ఆడుతూ 72 బంతుల్లో తన 35వ వన్డే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
మొదటి వికెట్‌కు గిల్, రోహిత్‌లు కలిసి ఏకంగా 255 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న 258 పరుగుల అత్యధిక భారత ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డును బద్దలు కొడతారని భావించిన తరుణంలో 26.2వ ఓవర్‌లో రోహిత్ శర్మ 101 పరుగుల వద్ద జైడెన్ సీల్స్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. రోహిత్ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా విండీస్ బౌలర్లను వదల్లేదు. సీల్స్ వేసిన 29వ ఓవర్‌లో భారత్ ఏకంగా 25 పరుగులు రాబట్టడంతో స్కోరు 300 దాటింది. కోహ్లీ ఔట్ అయినా తర్వాత వచ్చిన గైక్వైడ్ తో గిల్ భారత్ కు విజయాన్ని అందించాడు. గిల్, రోహిత్ భీకర సెంచరీలతో భారత్ రికార్డ్ 405 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేసి ప్రపంచ క్రికెట్ లో భారీ లక్ష్యాన్ని చేధించిన జట్లలో ఒకటిగా నిలిచింది.
అంతకుముందు ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా అత్యధిక లక్ష్యాన్ని చేధించింది. తర్వాత స్థానంలో భారత్ ఈరోజు విండీస్ పై 405 పరుగులను ఛేధించింది. ఈ రికార్డు ఛేధనలో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ పర్యటన నుంచి పరుగుల లేమితో బాధపడుతున్న రోహిత్ సెంచరీ చేశాక చిన్న పిల్లాడిలా గంతులేసిన వైనం ముచ్చటేసింది. రోహిత్ సెంచరీతో గౌహతి స్టేడియం మోత మోగింది. విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చి రోహిత్ టీమిండియా గెలుపులో గిల్ తో కలిసి తన కసిని చూపించాడు. మొత్తంగా ఈ రికార్డు విజయం టీమిండియా వన్డే వరల్డ్ కప్ సన్నాహకంలో ప్రత్యర్థులకు ఒక బలమైన హెచ్చరికగా చెప్పొచ్చు.