మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. ఇన్నాళ్లకు ఆ భర్తకు న్యాయం.. పాపం పండింది..

ఒకప్పుడు ఏ ఇల్లు అయితే నవ్వులతో.. ఆప్యాయతలతో విలసిల్లిందో.. అదే ఇంట్లోని మూలన ఉన్న ఒక నీలిరంగు డ్రమ్.. నిశ్శబ్దంగా ఒక భయంకరమైన ద్రోహానికి సాక్ష్యంగా నిలిచింది.

Update: 2026-09-30 16:08 GMT

ఒకప్పుడు ఏ ఇల్లు అయితే నవ్వులతో.. ఆప్యాయతలతో విలసిల్లిందో.. అదే ఇంట్లోని మూలన ఉన్న ఒక నీలిరంగు డ్రమ్.. నిశ్శబ్దంగా ఒక భయంకరమైన ద్రోహానికి సాక్ష్యంగా నిలిచింది. కట్టుకున్న భర్త ప్రాణాలను నిలువునా తీసి ఆ శరీరాన్ని ముక్కలు చేసి కాంక్రీట్‌తో సీల్ చేసిన క్రూరత్వానికి మీరట్ నగరం మూగబోయింది. "బిజినెస్ ట్రిప్‌కు వెళ్తున్నా" అని వచ్చిన ఒక మెసేజ్ వెనుక.. శాశ్వతంగా కన్నుమూసిన ఒక అమాయకుడి ఆర్తనాదం ఉందనే నిజం తెలిసి.. సౌరభ్ కుటుంబ సభ్యుల గుండెలు పగిలాయి. ప్రేమించాల్సిన చేతులే కాలకూట విషమై మారిన ఈ దారుణ కథనంలో 13 నెలల సుదీర్ఘ పోరాటం, 126 విచారణల తర్వాత చివరకు న్యాయం గెలిచినా.. ఆరిపోయిన ఒక జీవితం.. మిగిలిన ఆ కుటుంబ ఆవేదన మళ్లీ తిరిగొచ్చేవి కావు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నగరాన్ని ఒక వార్త పీడకలలా వెంటాడింది. అప్పటివరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఒక ఇంట్లోంచి బయటపడిన నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్.. దేశవ్యాప్తంగా ఉలిక్కిపడేలా చేసిన ఒక దారుణ కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. భర్త సౌరభ్ రాజ్‌పుత్ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో ప్రారంభమైన ఈ కథ.. చివరికి ఆయన భార్య ముస్కాన్ రస్తోగి , ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాల సమాధి కట్టిన పాపాలను బట్టబయలు చేసింది. 13 నెలల పాటు సుదీర్ఘంగా సాగిన న్యాయపోరాటం.. 126 విచారణల తర్వాత చివరకు కోర్టు వీరిద్దరినీ దేవుడిలాంటి న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టింది.

ఈ నేరం వెనుక ఉన్న పథకం ఎంతో క్రూరమైనది. ముస్కాన్, సాహిల్‌తో ఉన్న అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి భర్తను శాశ్వతంగా మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. ఒకరోజు రాత్రి సౌరభ్‌కు ఇచ్చిన ఆహారంలో మత్తుమందు కలిపింది. ఆయన స్పృహ కోల్పోయిన వెంటనే సాహిల్‌ను ఇంట్లోకి రప్పించి ఇద్దరూ కలిసి సౌరభ్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశారు. అనంతరం ఆ ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు ఒక నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌ను కొనుగోలు చేశారు. మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఆ డ్రమ్‌లో పడేశారు. దాన్ని ఎవరూ పసిగట్టకుండా ఉండేందుకు ఇసుక, సిమెంట్ మిశ్రమంతో నింపి, పూర్తిగా కాంక్రీట్‌తో సీల్ చేసేశారు.

హత్య పూర్తయిన తర్వాత పోలీసుల కళ్లు గప్పేందుకు నిందితులు మరో మాయాజాలం ప్రదర్శించారు. సౌరభ్ ఫోన్ నుంచి ఆయన కుటుంబ సభ్యులకు మెసేజ్‌లు పంపుతూ తను అత్యవసర బిజినెస్ ట్రిప్ మీద బయటకు వెళ్తున్నానని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ రోజుల తరబడి ఆయన రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో సీల్ చేసి ఉన్న ఆ నీలిరంగు డ్రమ్ అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని పగలగొట్టి చూడగా అందులో కుళ్ళిపోయిన సౌరభ్ శరీర భాగాలు లభ్యమవ్వడంతో శవం లేని మిస్సింగ్ కేసు కాస్తా ఘోరమైన హత్య కేసుగా మారింది.

నేరాన్ని దాచడానికి నిందితులు పడిన తాపత్రయమే వారి పతనానికి దారి తీసింది. సిమెంట్ బస్తాలు, కత్తులు, ప్లాస్టిక్ డ్రమ్ కొనుగోలు చేసిన స్థానిక దుకాణదారులు కోర్టులో ఇచ్చిన సాక్ష్యాలు ప్రాసిక్యూషన్‌కు కొండంత బలాన్నిచ్చాయి. దానికి తోడు హత్య జరిగిన సమయంలో సాహిల్ మొబైల్ లొకేషన్ సౌరభ్ ఇంట్లోనే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు నిరూపించాయి. దారుణానికి ఒడిగట్టిన మరుసటి రోజే ఇద్దరూ కలిసి హిమాచల్ ప్రదేశ్‌‌లోని సిమ్లా, మనాలిలోని హోటళ్లలో విలాసవంతంగా గడిపిన ఆధారాలను పోలీసులు సేకరించారు. వైద్య పరీక్షల్లోనూ పదునైన ఆయుధాల దాడి స్పష్టమైంది.

మొత్తం 22 మంది సాక్షుల వాంగ్మూలాలు, తిరుగులేని డిజిటల్, ఫోరెన్సిక్ సాక్ష్యాలను పరిశీలించిన జిల్లా జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా.. ముస్కాన్, సాహిల్‌‌లను దోషులుగా ప్రకటిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చారు. ఎలాంటి దయాదాక్షిణ్యాలకు తావులేని ఈ దారుణ నేరానికి పాల్పడిన నిందితులకు మరణశిక్షే సరైన న్యాయమని ప్రాసిక్యూషన్ గట్టిగా వాదిస్తోంది. అదృశ్యమైన వ్యక్తి కోసం మొదలైన అన్వేషణ.. కాంక్రీట్ డ్రమ్ సీలును ఛేదిస్తూ చివరకు హంతకులను ఉరితాడు అంచులకు చేర్చడంతో ఈ క్రైమ్ కథనం ముగింపునకు వచ్చింది.

Tags:    

Similar News