ప‌ట్ట‌భ‌ద్రుల ఓటు లెక్క‌లు ఇవీ.. కాంగ్రెస్‌కు భ‌రోసా!

తెలంగాణలో మ‌రోసారి ఎన్నిక‌ల వేడి రాజుకుంది. త్వ‌ర‌లోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి.

Update: 2026-09-30 13:30 GMT

తెలంగాణలో మ‌రోసారి ఎన్నిక‌ల వేడి రాజుకుంది. త్వ‌ర‌లోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ త‌న‌ అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. ఈ రెండు స్థానాలు కూడా.. మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ జిల్లాల‌కు ఒక‌టి, నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం మ‌రొక‌టి. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు కాంగ్రెస్ నుంచి సామ రామ్మోహన్ రెడ్డి. రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు.

వ‌చ్చే ఏడాది మార్చితో ప్ర‌స్తుతం ఉన్న ప‌ట్ట‌భ‌ద్రుల కాల ప‌రిమితి తీరుతుంది. ప్ర‌స్తుతం మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ స్థానం నుంచి సుర‌భి వాణీదేవి బీఆర్ ఎస్ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇక‌, నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా కాంగ్రెస్ త‌ర‌ఫున తీన్మార్ మ‌ల్ల‌న్న‌(చింత‌పండు న‌వీన్‌) ఉన్నారు. అయితే.. వీరిలో న‌వీన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌గా.. సుర‌భి వాణి పూర్తికాలం ఈ ప‌ద‌విలో ఉన్నారు. దీంతో ఈ రెండు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను కాంగ్రెస్ పార్టీ ఖ‌రారు చేసింది.

ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు బీఆర్ ఎస్ పార్టీ మ‌రోసారి సుర‌భి వాణికే టికెట్ ఇవ్వ‌నుందని తెలుస్తోంది. ఆమెకు స్థానికంగా సానుభూతి ఉంది. అలానే మంచి పేరు కూడా ఉంద‌ని బీఆర్ ఎస్ వ‌ర్గాలు భావిస్తు న్నాయి. ఇక‌, న‌ల్గొండ‌-ఖ‌మ్మం-వ‌రంగ‌ల్ స్థానం నుంచి వేరే నేత పేరు ప‌రిశీల‌న‌లో ఉంద‌ని చెబుతున్నారు. ఖ‌మ్మం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడి పేరును పార్టీ ప‌రిశీలిస్తోంది. ఇక‌, తీన్మార్ మ‌ల్ల‌న్న స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీకి రెడీ అవుతున్న‌ట్టు సంకేతాలు ఇస్తున్నారు.

కాంగ్రెస్ ఆశ‌లు..

ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ భారీగానే ఆశ‌లు పెట్టుకుంది. నిరుద్యోగుల‌కు క‌ల్పిస్తున్న ఉద్యోగాలు.. విద్యాసంస్థ‌ల్లో ఏర్పాటు చేస్తున్న మౌలిక స‌దుపాయాలు వంటివాటిని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. అదేవిధంగా చ‌దువుకునేందుకు అవ‌కాశాలు పెంచ‌డంతోపాటు.. ఉద్యోగ‌, ఉపాధి క‌ల్ప‌న‌ల‌కు పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్సించ‌డం త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని అంచ‌నా వేసింది. ఈ ఎన్నిక‌ల‌ను పార్టీ కీల‌కంగా భావిస్తోంది. ప‌ట్ట‌భ‌ద్రుల అభిప్రాయం ప్ర‌స్పుటంగా తెలుస్తుంద‌ని అంచ‌నా వేస్తోంది.

Tags:    

Similar News