స్టాలిన్ కేజ్రీవాల్ కోపం రాహుల్ మీదేనా ?
దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి పటిష్టంగా ఉంది. అందులో పాతిక దాకా పార్టీలు ఉన్నాయి.
దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి పటిష్టంగా ఉంది. అందులో పాతిక దాకా పార్టీలు ఉన్నాయి. అయితే ఏ పార్టీ కూడా కూటమి పెద్దన్న బీజేపీకి భిన్నంగా వాదనలు బహిరంగంగా విమర్శించే సాహసం చేయదు. అంతా ఒకే మాట మీద త్రాటి మీద ఉంటున్నారు. అఫ్ కోర్స్ అధికారం అలా అందరినీ కట్టి ఉంచింది అని భావించవచ్చు. అయితే దానితో పాటు నాయకత్వ సామర్ధ్యంగా కూడా చూడొచ్చు. చిత్రంగా విపక్షంలో ఉన్న ఇండియా కూటమిలో మాత్రం లుకలుకలు తరచూ బయటపడుతున్నాయి. దానికి కారణం కాంగ్రెస్ పెద్దన్న తీరుని మిత్రులు సహించలేకపోవడం అని ప్రచారంలో ఉంది. దాంతో పాటుగా రాహుల్ గాంధీ దూకుడు విధానాల మీద మిత్రులు నొచ్చుకుంటున్నారు అన్నది కూడా వినిపిస్తోంది. ఇక తమిళనాడు ఎన్నికలు వచ్చి ఏమి చేశాయి అంటే డీఎంకేని ఇండీ కూటమికి దూరం చేశాయని అంటున్నారు.
స్టాలిన్ ఎడ ముఖం :
డీఎంకేతో కాంగ్రెస్ కి తమిళనాడులో రాజకీయంగా చూస్తే దశాబ్దాల పొత్తు ఉంది. అలాంటిది పుటుక్కున తెంచేసుకుని కేవలం ఏడాదిన్నర వయసు ఉన్న టీవీకేతో ఖద్దరు పార్టీ జట్టు కట్టడాన్ని ఈ రోజుకీ డీఎంకే జీర్ణించుకోలేకపోతోంది. దాంతో నాటి నుంచి నేటి దాకా అంటే అయిదారు నెలలుగా కాంగ్రెస్ కి దూరం పాటిస్తూ వస్తోంది. ఇండియా కూటమి మీటింగులకు తానుగా డీఎంకే వెళ్లడం మానుకుంది. తన ప్రతినిధులను కూడా పంపించడం కూడా మానుకుంది. అయితే ఎన్డీయే కూటమికి దగ్గర అవుతున్నట్లు కాదని డీఎంకే చెబుతోంది. ఈ విషయంలో స్పష్ట ఉంది. ఇండియా కూటమి బలంగా ఉండాలని కోరుకుంటోంది, అదే సమయంలో రాహుల్ గాంధీ తమిళనాడు రాజకీయలలో అనుసరించిన వైఖరి పట్లనే డీఎంకే కానీ స్టాలిన్ కానీ కొంత గుస్సాగా ఉన్నారని వినిపిస్తోంది. అందుకే తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్ కి మరో సారి డీఎంకే డుమ్మా కొట్టేసింది.
ఆప్ ది అదే కధ :
దీనితో పాటుగా ఆప్ ది అదే తీరుగా ఉంది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ పోకడల మీద అసహనంగా ఉన్నారని తెలుస్తోంది. ఢిల్లీలో ఏణ్ణర్థం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేయడం వల్లనే తాము ఓటమి చెందామని కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఇండియా కూటమి మిత్ర పక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ తగ్గి వ్యవహరించాలని అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో లోక్ సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తన పాత్రను పెంచుకోవాలని ఆప్ వంటి పార్టీలు కోరుతున్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం మిత్రులు ఉన్న రాష్ట్రాలలో కూడా సయోధ్య కంటే పోటీ పడడానికే ప్రాధాన్యత ఇస్తోంది. దానితోనే ఆప్ అసంతృప్తిగా ఉంది. తాజా ఇండీ కూటమి మీటింగ్ కి ఆప్ కూడా డుమ్మా కొట్టడానికి అదే కారణంగా భావించాలని అంటున్నారు.
కీలక అంశం మీదనే :
ఇక ఇండియా కూటమి భేటీ ఒక కీలక అంశం మీదనే జరిగింది. సర్ ప్రక్రియతో పాటు ఓటు చోరీ వంటి అంశాల మీద చర్చించడం కోసం సమావేశం జరిగింది. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టే నోటీసు ముసాయిదాపై కూటమి చర్చించింది. ఇక రానున్న రోజులలో ఇదే అంశం మీద దేశవ్యాప్త ఆందోళనలకు ఇండీ కూటమి నిర్ణయించింది. అక్టోబర్ 2 నుంచి 8 వరకు ఇండి కూటమి నేతలు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు చేపడతారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. అలాగే అక్టోబర్ 6న ప్రతిపక్ష ఎంపీలు ఎన్నికల సంఘం ఆఫీస్ వరకూ వెళ్ళి పాదయాత్ర నిర్వహిస్తారని చెప్పారు. రాష్ట్రపతిని కలవడానికి కూడా నిర్ణయించారు. ఇక ఇదే విషయం మీద నవంబర్ 1న ఢిల్లీలో ఒక భారీ ర్యాలీని నిర్వహించేందుకు కూడా తీర్మానించారు.
తగ్గిన పార్టీలు :
ఇక ఇండీ కూటమి తాజా మీటింగుకి 21 పార్టీలు హాజరయ్యాయి. గతంలో 23 పార్టీలుగా ఉన్న ఇండి కూటమి నుంచి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశానికి దూరంగా ఉంటూ వస్తున్నాయి. తాజా మీటింగ్ కి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా హాజరు కాలేదు, ఆయన తన పార్టీ ఎంపీలు హరేంద్ర మాలిక్, మొహిబ్బుల్లా నద్వీ లను పంపించారు. మరో వైపు చూస్తే ఇండీ మీటింగ్ కి దూరంగా ఉన్నప్పటికీ జ్ఞానేశ్ కుమార్‌పై పార్లమెంట్‌లో తొలగింపు తీర్మానం వస్తే మద్దతు ఇస్తామని డీఎంకే పార్టీ ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ చెప్పడం విశేషం. ఆప్ కూడా ఏ విధంగా నిర్ణయిస్తుందో చూడాలి. మొత్తంగా చూస్తే రాహుల్ గాంధీ పట్ల కోపమా కాంగ్రెస్ పెద్దన పాత్ర మీద అసహనమా అన్నది తెలియదు కానీ డీఎంకే ఆప్ పార్టీలు అయితే దూరం పాటిస్తున్నాయి.