33% టికెట్ల మాట మారదా? అప్పట్లో చంద్రబాబు.. ఇప్పుడు లోకేశ్!

అమరావతి పరిధిలోని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన మహానాడులో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు.. ఏపీ మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్య చేశారు.

Update: 2026-05-28 18:30 GMT

ఏడాదిలో మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. మహానాడు జరిగే రోజుల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పార్టీ.. పార్టీ కార్యకర్తలు.. సానుభూతిపరులు గుర్తుకు వస్తుంటారు. ఆ సందర్భంగా ఆయన బోలెడన్ని హామీలు ఇస్తారు. పార్టీ అధికారంలో ఉంటే ఒకతరహా మాటలు.. ప్రతిపక్షంలో ఉంటే మరో తరహా వ్యాఖ్యలు ఆయన నోటి వస్తుంటాయని.. మహానాడు పూర్తైనంతనే మళ్లీ మామూలే అన్న విమర్శ తెలుగు తమ్ముళ్ల మాటల్లో వినిపిస్తూ ఉంటుంది. ఈ ఏడాది మహానాడును వర్చువల్ గా నిర్వహిస్తూ.. ఫిజికల్ గా పరిమితంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చిన పొదుపు సూత్రాలకు అనుగుణంగా ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ప్రకటించటం తెలిసిందే.

అమరావతి పరిధిలోని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన మహానాడులో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు.. ఏపీ మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్య చేశారు. పార్లమెంటులో మహిళా బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని.. అందుకే పార్లమెంటులో బిల్లు పాస్ అయినా.. కాకున్నా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని తాము భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 33 శాతం పార్టీ టికెట్లు మహిళలకు ఇవ్వాలని తాను మహానాడు వేదిక ద్వారా ప్రతిపాదన చేస్తున్నట్లుగా ప్రకటించారు.

ఈ ప్రతిపాదనను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. చట్టసభల్లో మరింత మంది మహిళలు ప్రాతినిధ్యం వహించాలన్న అభిలాషను వ్యక్తం చేశారు లోకేశ్. ఇక్కడే ఒక విషయాన్ని ప్రస్తావించాలి. గతంలో చంద్రబాబు తాను విపక్షంలో ఉన్నప్పుడు.. ఎన్నికల్లో బీసీలకు 33 శాతం టికెట్లు ఇస్తామని ఒకసారి.. దళితులకు 33 శాతం టికెట్లు ఇస్తామని మరోసారి.. ఇలా వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు వేదికలపై మాట ఇవ్వటాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి.

వినేందుకు కొన్ని అంశాలు బాగున్నా.. వాస్తవంలో అవన్నీ ఆచరణ సాధ్యం కానట్లుగా ఉంటాయి. అలాంటి అంశాల్ని ప్రస్తావించటం.. ప్రచారం చేసుకోవటం బాగున్నా.. రేపొద్దున టికెట్ల పంపిణీ వేళ ఆచరణ సాధ్యం కాని పరిస్థితి. ఆ సమయంలో ఇప్పుడు చెప్పినంత కమిట్ మెంట్ ను.. భావోద్వేగాన్ని చేతల్లో చూపించలేని దుస్థితి.అప్పుడు మాట పోవటమే కాదు.. ఏదో మాటలుగా మాట్లాడటమే తప్పించి.. మరొకటి ఉండదన్న విషయాన్ని రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది. అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. ఇద్దరు 33 శాతమే. కాకుంటే.. ఆయన టికెట్లు ఇస్తామన్నది కొన్ని వర్గాలకైతే.. ఇప్పుడు కొడుకు లోకేశ్ మహిళలకు ఇస్తామంటున్నారు. ఇలాంటివి మాటల్లో చెప్పే కన్నా.. చేతల్లో చూపిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఈ విషయాన్ని చంద్రబాబు.. లోకేశ్ లు ఎప్పుడు గుర్తిస్తారో చూడాలి.

Tags:    

Similar News