నేను ఏ ప్రాంతవాసినో నాకే తెలియదు !

నందమూరి బాలక్రిష్ణ. యాభై ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకుని అరుదైన ఘనతను సాధించిన మేటి నటుడు. బసవతారకం ఆసుపత్రికి చైర్మన్ గా ఎంతో సేవ చేస్తున్న వారుగా ఉన్నారు.;

Update: 2026-02-21 06:44 GMT

నందమూరి బాలక్రిష్ణ. యాభై ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకుని అరుదైన ఘనతను సాధించిన మేటి నటుడు. బసవతారకం ఆసుపత్రికి చైర్మన్ గా ఎంతో సేవ చేస్తున్న వారుగా ఉన్నారు. ఇక హిందూపురం శాసన సభ్యుడిగా మూడు సార్లు నెగ్గిన బాలయ్య సినీ సీమ నుంచి ఆ రికార్డుని అన్న నందమూరి తారక రామారావు తరువాత సాధించిన వారుగా ఉన్నారు. మాటలో కల్మషం లేకపోవడం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే నైజం బాలయ్య విజయానికి అసలు రహస్యాలు.

పుట్టింది చెన్నై :

ఇదిలా ఉంటే బాలయ్య తాజాగా తన సొంత నియోజకవర్గం హిందూపురంలో 80 సెంట్ల స్థలం తీసుకుని సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారు దానికి గానూ ఆయన భూమి పూజ కూడా తాజాగా చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో బాలయ్య మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ ప్రాంత వాసినో తనకే తెలియదు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. పుట్టింది చెన్నై పెరిగింది హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నది హిందూపురం అంటూ చెప్పుకొచ్చారు.

నాన్న కట్టించారు :

ఇక హైదరాబాద్ లో తాను నివాసం ఉంటున్న జూబ్లీ హిల్స్ ఇల్లు తన తండ్రి రామారావు కట్టించి ఇచ్చారు అని బాలయ్య చెప్పారు. తనకు తానుగా ఎక్కడా సొంత ఇల్లు ఈ రోజు దాకా కట్టుకోలేదని ఆయన చెప్పారు. అందుకే తాను హిందూపురాన్ని తన సొంత ఊరుగా భావించి ఇల్లు కట్టుకుంటున్నాను అని అన్నారు ఇక ఈ రోజు నుంచి తన నివాసం హిందూపురం అని చెప్పారు. బాలయ్య కేరాఫ్ హిందూపురం అని కూడా ఆయన గట్టిగా చెప్పారు.

విమర్శలకు చెక్ :

బాలయ్య హిందూపురానికి అతిధిగా వచ్చి పోతున్నారు అని ఆయన నివాసమే లేదని ఇంత కాలం రాజకీయ ప్రత్యర్ధులు విమర్శలు చేశారు. అయితే అలాంటి వాటికి తన చేతలతోనే చెక్ చెబుతూ బాలయ్య సొంతింటి నిర్మాణం ప్రారంభించారు ఇక మీదట బాలయ్య సొంత ఇంటి నుంచే హిందూపురం రాజకీయాలను నడిపించనున్నారు. అంతే కాదు రానున్న కాలంలో కూడా ఆయన మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు అని అంటున్నారు. బాలయ్య నో చెబితేనే తప్ప ఆ సీటు ఎవరికీ టీడీపీ అధినాయకత్వం ఇవ్వదని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఏడు పదుల వయసుకు చేరువ అవుతున్న బాలయ్య సినిమాలు తగ్గించి పూర్తి స్థాయి రాజకీయాల మీద దృష్టి పెడతారు అని అంటున్నారు. అందుకే ఆయన తన శాశ్వత నివాసంగా హిందూపురాన్ని ఎంచుకుని మరీ సొంత ఇల్లు కడుతున్నారని అంటున్నారు. 2029 తరువాత బాలయ్య మరింత క్రియాశీలకంగా టీడీపీలోనూ ఏపీ రాజకీయాల్లోనూ తన వంతు పాత్ర పోషిస్తారు అని అంటున్నారు.

Tags:    

Similar News