మోడీ వెళ్లనున్న దేశంలో కాలగర్భంలో కలిసిన వజ్రాల నగరం గురించి తెలుసా?

ఇందులో భాగంగా... ఇసుకతో మింగబడిన నిర్జన నగరం ‘కాల్మన్‌ స్కోప్‌’ గతవైభవం తెరపైకి వచ్చింది. ఇది.. ప్రకృతి అన్నింటినీ తిరిగి పొందే శక్తిని కలిగి ఉంటుంది అనేదానికి గుర్తుగా నిలుస్తోంది.;

Update: 2025-07-08 19:30 GMT

భారత ప్రధాని మోడీ జులై 9న నమీబియా వెళ్లనున్నారు. అక్కడి పార్లమెంట్‌ లో ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో నమీబియా దేశ విశిష్టత, అక్కడి చరిత్రాత్మక స్థలాల తదితర అంశాలు వార్తల్లోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... ఇసుకతో మింగబడిన నిర్జన నగరం ‘కాల్మన్‌ స్కోప్‌’ గతవైభవం తెరపైకి వచ్చింది. ఇది.. ప్రకృతి అన్నింటినీ తిరిగి పొందే శక్తిని కలిగి ఉంటుంది అనేదానికి గుర్తుగా నిలుస్తోంది.


అవును... నమీబ్‌ ఎడారిలో నిర్మితమైన ఓ అందమైన నగరమే కాల్మన్ స్కోప్. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటిగా నిలిచిన ఇక్కడ 1900 ప్రారంభంలో పెద్దమొత్తంలో వజ్రాలు దొరికేవి. దీంతో జర్మనీ నుంచి అధిక సంఖ్యలో ప్రజలు, వర్తకులు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఎడారి ప్రాంతమైనప్పటికీ.. పెద్ద పెద్ద భవంతులు నిర్మించారు.. సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు.


ఇందులో భాగంగా... విలాసవంతమైన ఇళ్ళు, ఆసుపత్రి, థియేటర్, పాఠశాలను కూడా నిర్మించారు. ఈ పట్టణంలో విద్యుత్, కరెంట్ వాటర్, ఐస్ ఫ్యాక్టరీ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. జర్మన్‌ శిల్పకళాకృతులు ఉట్టిపడేలా నిర్మించిన కట్టడాలతో ఈ నగరం అప్పట్లో విలాసాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. అయితే... రానురానూ అక్కడ వజ్రాలు మాయమయ్యాయి.. తదనుగుణంగా ప్రజలూ మాయమయ్యారు.

అయితే... దక్షిణాది ప్రాంతాల్లో ఎక్కువగా వజ్రాలు దొరుకుతున్నట్లు గుర్తించిన జర్మన్లు అటువైపు నడక ప్రారంభించారు. కుటుంబాలతో సహా వలస వెళ్లడం ప్రారంభించారు. ఫలితంగా... 1950 నాటికి చాలా మంది ఈ నగరాన్ని ఖాళీ చేసేశారు. దీంతో ఒకప్పుడు కళకళలాడుతూ సందడిగా ఉన్న నగరం భయంకరంగా నిశ్శబ్దంగా మారిపోయింది.

నేడు ఈ కాల్మన్‌ స్కోప్‌ ఏమాత్రం గుర్తుపట్టకుండా మారిపోయింది. తనను ఆక్రమించి నిర్మించిన నగరాన్ని.. ఎడారి తిరిగి పొందడం ప్రారంభించింది. విరిగిన కిటికీలు, తలుపుల ద్వారా గదులను ఇసుకతో నింపుతుంది. ఒకప్పుడు సందడిగా ఉండే గొప్ప ఇళ్లలోకి ఇసుక చొచ్చుకుపోతుంది. దీంతో.. ఒకప్పటి థియేటర్లు, రెస్టారెంట్లు, పార్కులు మొదలైన ఇప్పుడు ఇసుక దిబ్బల కింద ఉండిపోయాయి.

ఏది ఏమైనా కాల్మన్‌ స్కోప్‌ అనేది కేవలం శిథిలమైన నగరం మాత్రమే కాదు. ఇది శాశ్వతంగా ఉండలేని సంపదపై నిర్మించబడిన నగరం యొక్క పెరుగుదల, పతనాలకు సాక్ష్యం. మానవ ఆశయం ఎంత గొప్పదైనా, తిరిగి పొందే ప్రకృతి శక్తికి ఇది నిశ్శబ్ధ గుర్తు. ప్రస్తుతం ఇక్కడ చరిత్ర కారులు, ఫొటోగ్రాఫర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. కాలగర్భంలో కలిసిపోయిన నగరంలో సాహసాలు, పరిశోధనలు చేస్తున్నారు.

Tags:    

Similar News