ప్రచారానికి మాత్రమే పరిమితమా ?

ముద్రగడను తీసుకోవటం వల్ల ఉపయోగం ఏమిటంటే కాపులు బాగా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం చేయించాలని నిర్ణయించారట.

Update: 2024-03-08 04:34 GMT

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. పరిస్ధితులన్నీ అనుకూలిస్తే ఈనెల 12వ తేదీన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కొడుకుతో పాటు ముద్రగడ పార్టీ కండువా కప్పుకోవటం ఖాయమంటున్నారు. పార్టీలో చేరటం వరకు ఓకేనే కాని రాబోయే ఎన్నికల్లో ముద్రగడ పాత్రేమిటి ? అన్నదే ఇపుడు చర్చనీయాంశమైంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ముద్రగడ ఎన్నికల్లో పోటీచేయరట. కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమవుతారని అంటున్నారు. కొడుకు ముద్రగడ గిరికి కూడా పోటీచేసే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు ఇస్తారట.

ముద్రగడను తీసుకోవటం వల్ల ఉపయోగం ఏమిటంటే కాపులు బాగా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం చేయించాలని నిర్ణయించారట. అంటే అచ్చంగా కాపులున్న నియోజకవర్గాలు మాత్రమే కాదు. అన్నీ నియోజకవర్గాల్లోను ముద్రగడ ప్రచారం చేసినా కాపు నియోజకవర్గాలపైన ఎక్కువగా దృష్టిపెట్టబోతున్నారట. ఉభయగోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో కాపుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అయితే ముద్రగడ నాయకత్వాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోని కాపులు పెద్దగా ఆమోదించరు.

Read more!

కాకపోతే ఇక్కడ ముద్రగడ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమవబోతున్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. నిజానికి ముద్రగడను పార్టీలోకి చేర్చుకునే విషయంలో పార్టీలోని చాలామంది నేతలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే కాపు ఉద్యమనేత ని భరించటం చాలా కష్టం. ప్రతి చిన్న విషయానికి అలుగుతారు. అలిగితే మాత్రం పార్టీలో నానా రాద్దాంతం చేస్తారు. అందుకనే ముద్రగడను భరించటం కష్టమన్న పద్దతిలో ఈయన్ను తీసుకోవద్దని జగన్ కు కొందరు నేతలు సలహా ఇచ్చారు. అందుకనే ముద్రగడ విషయంలో పార్టీ వెనక్కుపోయింది.

అయితే మారిన పరిణామాల్లో ఉద్యమ నేతను మళ్ళీ పార్టీలోకి చేర్చుకోవాలని అనుకున్నారు. కొద్దిరోజులుగా జరిగిన పరిణామాల కారణంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే ముద్రగడతో పాటు ఆయన మద్దతుదారులు బాగా మండిపోతున్నారు. కాబట్టి ఉద్యమనేత ముఖ్య టార్గెట్ అంతా జనసేనను దెబ్బకొట్టడంపైనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. పిఠాపురంలో పవన్ గనుక పోటీచేస్తే సమీకరణలు మారిపోతాయి. అప్పుడు ముద్రగడ పోటీలోకి దిగే అవకాశాలు చాలానే ఉన్నాయట. వైసీపీకి మద్దతుగా ముద్రగడ ప్రచారంచేస్తే పార్టీకి ఏమేరకు లాభం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. మరి చివరకు ఏమిజరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News