రూ.20 లక్షల విలువైన నగల పర్సు కొట్టేసిన కోతి.. ఏమి చేసిందంటే..?
వివరాళ్లోకి వెళ్తే... యూపీలోని బృందావన్ లో గల బాంకే బీహారీ ఆలయానికి అలీఘర్ కు చెందిన అభిషేక్ అగర్వాల్ అనే వ్యక్తి కుటుంబంతో పాటు కలిసి వచ్చారు.;
కొండలపై ఉన్న ఆలయాలకు, అటవీ ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు కోతుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు చాలా మందికి స్వానుభవమే! చేతిలో ఉన్న వస్తువులు అమాంతంగా వచ్చి లాక్కుని పోవడం, వెంటాడి మరీ చేతిలో ప్యాకెట్లు ఎత్తుకోవడం చేస్తుంటాయి. ఈ క్రమంలో ఆలయానికి వెళ్లిన ఓ మహిళ పర్సును కోతి ఎత్తుకుపోయింది. ఆ పర్సులో రూ.20 లక్షల విలువైన నగలు ఉండటం గమనార్హం.
అవును... ఆలయానికి వెళ్లిన ఓ మహిళ వద్ద ఉన్న రూ.20 లక్షల విలువైన నగల పర్సును కోతి కొట్టేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో చోటు చేసుకుంది. దీంతో... బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల సాయంతో ఆ కోతి ఎక్కడెక్కడికి పర్యటించింది వంటి వివరాలు పసిగట్టి.. ఫైనల్ గా ఆ కోతి చేసిన పనిని గుర్తించారు.
వివరాళ్లోకి వెళ్తే... యూపీలోని బృందావన్ లో గల బాంకే బీహారీ ఆలయానికి అలీఘర్ కు చెందిన అభిషేక్ అగర్వాల్ అనే వ్యక్తి కుటుంబంతో పాటు కలిసి వచ్చారు. అనంతరం గుడిలోకి వెళ్తున్న సమయంలో దొంగలు ఉంటారనే భయంతో అభిషేక్ భార్య తన రూ.20 లక్షల విలువైన నగలను తీసి పర్సులో పెట్టుకున్నారు. ఈ క్రమంలో దర్శనం చేసుకుని పర్సు చేతపట్టి తిరిగి వస్తున్నారు.
సరిగ్గా ఈ సమయంలో వారివద్ద ఉన్న రూ.20 లక్షల విలువైన నగలు ఉన్న పర్సును లాక్కొని పారిపోయింది కోతి. ఆ సమయంలో అది ఇరుకైన సందుల గుండా పారిపోయింది. ఈ సమయంలో అభిషేక్ ఫ్యామిలీతో పాటు పలువురు ఆ కోతిని వెతకడం ప్రారంభించారు. అయినప్పటీకీ ప్రయోజనం లేకపోవడంతో.. పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, వాటి సహాయంతో తీవ్ర గాలింపు చేపట్టారు. అలా సుమారు 8 గంటలు ప్రయత్నించిన తర్వాత.. ఆ పర్సును కోతి సమీపంలోని చెట్లపొదల్లో పడేసి వెళ్లినట్లు గురించారు. అనంతరం ఆ పర్సును తీసుకుని అభిషేక్ ఫ్యామిలీకి అప్పగించారు.