అందాల నటికి అక్రమ పాస్ పోర్టు.. కృష్ణమోహన్‌రెడ్డి గతంలో పెద్ద క్రైం

మోనికా బేడీ.. బాలీవుడ్ –టాలీవుడ్ లలో 25 ఏళ్ల కిందట బిజీ హీరోయిన్. అలాంటి నటికి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు ఒకప్పుడు ప్రధాన అనుచరుడైన అబూ సలేంకు మోనికా బేడీ ప్రియురాలు.;

Update: 2025-05-19 06:33 GMT

శ్రీకాంత్ ను హీరోగా పరిచయం చేసిన తాజ్ మహల్, రాజశేఖర్ హీరోగా నటించిన శివయ్య వంటి సూపర్ హిట్ సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది ఓ బాలీవుడ్ హీరోయిన్. బాలీవుడ్ లోనూ మంచి అవకాశాలు దక్కించుకుని పేరు తెచ్చుకుంది. పెద్ద స్టార్ అవుతుందని అనుకుంటున్న సమయంలో అనూహ్యం అండర్ వరల్డ్ లింక్స్ ఉన్నట్లు తేలి ఆమె సినీ కెరీర్ మధ్యలోనే ముగిసింది. ఆమె ప్రియుడు, అండర్ వరల్డ్ డాన్ అరెస్టుతో కష్టాలు మొదలయ్యాయి. అయితే, ఈమెకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరమైన కర్నూలులో అక్రమంగా పాస్ పోర్టు లభించింది. ఇప్పుడిదంతా ఎందుకు అంటారా?

మోనికా బేడీ.. బాలీవుడ్ –టాలీవుడ్ లలో 25 ఏళ్ల కిందట బిజీ హీరోయిన్. అలాంటి నటికి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు ఒకప్పుడు ప్రధాన అనుచరుడైన అబూ సలేంకు మోనికా బేడీ ప్రియురాలు. ఇతడు 1993 ముంబై బాంబు పేలుళ్లు సహా దేశద్రోహ కేసుల్లో నిందితుడు. 2002లో పోర్చుగల్ కు పారిపోయిన అబూసలేం అక్కడే తర్వాత మోనికాతో కలిసి పట్టుబడ్డాడు.

ఇక మోనికా బేడీకి భారత పాస్ పోర్టు 2001లో కర్నూలలో జారీ అయింది. ఏ రాష్ట్రానికో చెందిన ఆమెకు కర్నూలు బాబూగౌండ వీధి నివాసం చిరునామాతో సనా మాలిక్ కమల్ పేరిట పాస్ పోర్టు జారీ అయింది. అప్పుడు తహసీల్దార్ గా ఉన్నది ఎవరంటే.. ప్రస్తుతం ఏపీ అక్రమ మద్యం కేసులో అరెస్టయిన మాజీ సీఎం వైఎస్ జగన్‌ ఓఎస్డీ పెళ్లకూరు కృష్ణమోహన్‌ రెడ్డి.

2001 ఏప్రిల్‌ 9న కృష్ణమోహన్‌ రెడ్డి ఇచ్చిన నివాస ధ్రువీకరణ పత్రం ద్వారానే మోనికా బేడీ పాస్‌ పోర్టు పొందింది. 2002లో అబూ సలెం, మోనికా బేడీ పోర్చుగల్ లో పట్టుబడడంతో.. వారి పాస్ పోర్టులను పరిశీలించారు. దీంతో మోనికా అక్రమ పాస్ పోర్టు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. ఇందులో భాగంగా అప్పటి కర్నూలు తహసీల్డార్ కృష్ణమోహన్‌ రెడ్డిని విచారించింది. అయితే, అప్పట్లో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్ఐ)గా ఉన్న మహ్మద్‌ యూనిస్‌ నివేదిక ఆధారంగానే తాను నివాస ధ్రువపత్రం జారీ చేశానంటూ కృష్ణమోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆ కేసులో ఆయన సాక్షిగా మాత్రమే ఉండగా.. ఆర్ఐ, ఏఎస్ఐలకు శిక్ష పడింది.

గమనార్హం ఏమంటే..మోనికాకు నకిలీ పాస్‌ పోర్టు జారీ అయిన సమయంలో కర్నూలు ఎస్పీగా ఉన్నది పి.సీతారామాంజనేయులు. 2002లో కుంభకోణం వెలుగులోకి వచ్చేసరికి ఎస్పీగా ఎన్‌.సంజయ్‌ ఉన్నారు. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ప్రస్తుతం ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో అరెస్టై జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్‌ ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్ గా పనిచేసిన సంజయ్‌పై ఏసీబీ కొన్నాళ్ల క్రితం కేసు పెట్టింది. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌ లో ఉన్నారు.

మోనికా బేడీకి పాస్ పోర్టు వ్యవహారంలో కృష్ణమోహన్‌ రెడ్డి తన కింది అధికారి మాటలను నమ్మి ముందుకెళ్లారు. ఇందులో ఓ తహసీల్దార్ గా ఆయన చేసింది ఏమీ ఉండదు. అయితే, ప్రస్తుత ఏపీ మద్యం కేసు నేపథ్యంలో గతం చర్చకు వస్తోంది.

Tags:    

Similar News