పాక్ కు ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు చెక్.. ఎప్పుడంటే?

ఇప్పుడు ఆ దిశగానే మోడీ సర్కారు అడుగులు వేస్తుందా? అంటే అవునన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.;

Update: 2025-04-30 05:20 GMT

నాగరిక సమాజంలో యుద్ధం రూపురేఖలు మారిపోయాయి. ఇప్పటికి కొన్ని దేశాల మధ్య జరిగే బాంబు దాడులు.. వైమానిక దాడులకు మించి వ్యూహాత్మకంగా దెబ్బ తీసే యుద్ధమే మెరుగైనది. ఎందుకంటే.. దాడులతో ప్రాణ నష్టం భారీగా ఉంటుంది. శత్రుదేశానికి సంబంధించిన ప్రాణ నష్టం గురించి మాట్లాడటమా? అని కొందరు అనొచ్చు. కానీ.. ప్రాణం ఎవరికైనా ప్రాణమే. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదు. అదే సమయంలో హింసకు భిన్నంగా మైండ్ గేమ్ తో పాటు.. రోటీన్ కు భిన్నమైన వ్యూహాలతో వెళ్లటం ద్వారా శత్రువును అష్టదిగ్బంధనం చేస్తే ఫలితం త్వరగా వస్తుంది.

ఇప్పుడు ఆ దిశగానే మోడీ సర్కారు అడుగులు వేస్తుందా? అంటే అవునన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో శత్రుదేశానికి చుక్కలు కనిపించేలా.. ఆ దేశానికి వెళ్లే నదీ ప్రవాహానికి చెక్ చెప్పేలా నిర్ణయం తీసుకోవటం ఒకటిగా చెప్పొచ్చు. నిజానికి ప్రత్యక్ష యుద్ధం చేపట్టిన కొద్ది రోజుల తర్వాత రావాల్సిన ఫలితం మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో యుద్ధానికి ముందే ఫలితాలు వచ్చేలా ఉన్నాయని చెప్పాలి.

యుద్ధమే ఆరంభం కాక ముందే ఇంతటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్న భారత్.. యుద్ధం అన్నది జరిగితే పరిస్థితులు మరెంత దారుణంగా ఉంటాయన్న భావన పాక్ కు కలిగేలా చేస్తున్నారని చెప్పాలి. తాజాగా మరో కీలక అంశాన్ని మోడీ సర్కారు గుర్తించింది. పాకిస్థాన్ కు ఎగుమతి చేసే ఫార్మా ఉత్పత్తులపై నిషేధాన్ని విధించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. పాక్ కు తగిలే ఎదురుదెబ్బ అంతా ఇంతా కాదు.

తాజా పరిణామాల నేపథ్యంలో మన దేశం నుంచి పాక్ కు ఎగుమతి అయ్యే ఫార్మా ఉత్పత్తుల వివరాలను వెంటనే తమకు అందజేయాలని కేంద్ర ఎరువులు.. రసాయన శాఖ పరిధిలోని డీఓపీ (డిపార్టుమెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ తో పాటు వాణిజ్య శాఖకు సంబంధించిన ఎగుమతుల్ని పర్యవేక్షించే ఫార్మెక్సిల్ ను కూడా కోరింది. మన దేశం నుంచి ప్రపంచంలోని 200 దేశాలకు మనం ఫార్మా ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తున్నాం. ఇందులో పాకిస్థాన్ 38వ స్థానంలో ఉంది. మన దేశం నుంచి పాకిస్థాన్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ను దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు భారత్ నుంచి దిగుమతులు ఆగిపోతే.. ఆ దేశంలో ఔషధాల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మోడీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News