చంద్రబాబుపై మోడీ 'మెప్పు మంత్రం'.. బుట్టలో పడితే కష్టమేనా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. రాజకీయ చతురత చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన ఎవరినీ అంత సామాన్యంగా మెచ్చుకోరు.;
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. రాజకీయ చతురత చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన ఎవరినీ అంత సామాన్యంగా మెచ్చుకోరు. ఒకవేళ మెచ్చుకున్నారంటే.. ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నార న్న సంకేతాలు ఇచ్చేసినట్టేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. నేతలను ప్రసన్నం చేసుకునేందుకు మోడీ వేసే తొలి గేలం మెప్పు. వారిని ఆకాశానికి ఎత్తేస్తారు. ఇక, పదే పదే సమస్యలతో తన వద్దకు వచ్చే వారిని కూడా ఆయన మెచ్చుకుంటారు. తద్వారా.. వారి నోటికి తాళం వేసే ప్రయత్నం చేస్తారని అంటారు.
అంటే.. ఎవరైన పదే పదే సమస్యల చిట్టాను పట్టుకుని ప్రధాని చుట్టూ తిరిగితే.. ఆయన సహించలేరు. వీరిని నిలువరించేందుకు పలు మంత్రాలు వేస్తారు. దీంతో కీలకమైంది.. మెప్పు మంత్రం. దీని ద్వారా ఏదైనా అడగాలని అనుకున్నవారు కూడా.. మోడీ మాటలకు పడిపోతారు. ఈ విషయాన్ని గతంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ మాత్రమే కాదు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పుకొచ్చారు. ``మేం ఏదో అడగాలని ఆయన దగ్గరకు వెళ్తాం. ముందు బాగా రిసీవ్ చేసుకుంటారు. ఏదైనా సమస్య చెప్పే సరికి.. మీరు అద్భుతం.. చాలా ఫ్యూచర్ ఉంది.. అని మెచ్చుకుంటారు. ఇంక మేం ఏం మాట్లాడతాం.`` అని నితీష్ వ్యాఖ్యానించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇలానే.. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు విషయంలోనూ మోడీ వ్యవహరిస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబును తాజాగా మోడీ ఆకాశానికి ఎత్తేశారు. బాబు విజన్, సుపరిపాలన అద్భుతం అంటూ.. ప్రశంసలు గుప్పించారు. అంతేకాదు.. 2000 సంవత్సరం నుంచి కూడా తనకు బాబుతో సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇంకేముంది.. సహజంగానే పొగడ్తలకు పడిపోని నాయకుడు ఎవరుంటారు. పైగా చంద్రబాబు అయితే.. మరీ ఎక్కువ.
ఫలితంగా.. ఏపీ సమస్యలపై కేంద్రం వద్ద ఆయన గట్టిగా మాట్లాడలేని పరిస్థితి వస్తుందని అంటున్నారు పరిశీలకులు. మోడీకి కావాల్సింది కూడా. . ఇదే!. అందుకే.. తరచుగా బాబుపై మోడీ ప్రశంసల మంత్రాలు పఠిస్తున్నారని హెచ్చరిస్తున్నారు. కానీ, ఈ మెప్పులకు పడిపోకుండా.. రాష్ట్రానికి కావాల్సినవి అడిగి తీసుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉంటుందని మోడీ గురించి బాగా తెలిసిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.