ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వివాదాలు... చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారా..?
ఏపీ రాజధాని అమరావతిలోని నీరుకొండలో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు అంశం ప్రస్తుతం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.;
ఏపీ రాజధాని అమరావతిలోని నీరుకొండలో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు అంశం ప్రస్తుతం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం తలపెట్టిన ఈ ప్రాజెక్టుపై సోషల్ మీడియా వేదికగా కొందరు నెగటివ్ ప్రచారం మొదలు పెట్టేశారు. ముఖ్యంగా 1750 కోట్ల భారీ వ్యయం అంటూ ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన మద్దతుదారులు, అలాగే వైసీపీ సపోర్టర్స్ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడిగా పేరొందిన ఎన్టీఆర్ ను వ్యక్తిగతంగా దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం ఇప్పుడు దృష్టి సారించింది. గత కొంతకాలంగా ఈ వివాదం కొనసాగుతున్నా అధికార యంత్రాంగం స్పందన ఆలస్యమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అయినా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు వార్నింగ్ ఇవ్వడం విశేషం. నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు నిర్ణయం ఇప్పటిది కాదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూపొందించిన అమరావతి ప్రణాళికలో భాగంగానే దీనిని ప్రతిపాదించారు. కేవలం ఎన్టీఆర్ విగ్రహం మాత్రమే కాకుండా అంబేద్కర్, పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల విగ్రహాలను కూడా రాజధానిలోని వివిధ ప్రాంతాలలో ప్రతిష్టించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలో విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని హడావుడిగా ఏర్పాటు చేయడంతో అమరావతి ప్రణాళికలో మార్పులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత మాస్టర్ ప్లాన్ పునరుద్ధరించి విగ్రహాల నిర్మాణ ప్రక్రియను మళ్ళీ పట్టాలెక్కించింది.
మంత్రి నారాయణ ఒక సందర్భంలో ఈ ప్రాజెక్టు ఖర్చు గురించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి కుల రాజకీయాలకు వాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విగ్రహ నిర్మాణానికి ప్రజాధనాన్ని వెచ్చించడం లేదని సమాచారం. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ నిధులకు బదులుగా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని యోచిస్తున్నారు. విగ్రహం తయారీ, ఏర్పాటుతో పాటు భవిష్యత్తులో దాని నిర్వహణ బాధ్యతలను కూడా ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పర్యాటక రంగ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్థికపరమైన వాస్తవాలు ఇలా ఉన్నా కొందరు కావాలని ప్రభుత్వంపై దాడి చేయడం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయా ? అన్న సందేహాలు కూడా తెరమీదకు వస్తున్నాయి.
అసలు వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియకపోవడంతో విగ్రహ ఏర్పాటుపై జనసేన, వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేక విమర్శలతో పాటు కులాల మధ్య చిచ్చు రాజేసే కామెంట్లు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి వారిని ప్రభుత్వం కంట్రోల్ చేయాలన్న డిమాండ్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే సరైన క్లారిటీ ఇచ్చి ఉంటే ఇలాంటి విద్వేషాలు, వ్యతిరేక కామెంట్లు వచ్చి ఉండేవే కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం ఆలస్యంగా కళ్లు తెరవడంతోనే ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ అనవసర రాద్దాంతం నడుస్తోంది.