అమెరికానే కాదు.. ఇండియన్ మార్కెట్లను ట్రంప్ ముంచేస్తాడా...?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ అంశాన్ని వేదికగా చేసుకుని యూరప్ దేశాలపై ప్రకటించిన వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తోంది.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ అంశాన్ని వేదికగా చేసుకుని యూరప్ దేశాలపై ప్రకటించిన వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తోంది. గ్రీన్‌లాండ్ అమ్మకం విషయంలో సహకరించని ఎనిమిది ఐరోపా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఫిబ్రవరి 1 నుండి పది శాతం అదనపు సుంకాలు విధిస్తామనే హెచ్చరికలు ప్రపంచ వాణిజ్య రంగంలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికాలోని వాల్ స్ట్రీట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఎస్ అండ్ పీ 500 సూచీ గడిచిన అక్టోబర్ తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. డౌ జోన్స్ ఏకంగా 870 పాయింట్ల మేర నష్టపోయింది. ఇన్వెస్టర్లు భయాందోళనలతో తమ షేర్లను అమ్మకానికి పెట్టడంతో మార్కెట్ విలువ భారీగా హరించుకుపోయింది.
టెక్నాలజీ రంగంలోని దిగ్గజ సంస్థలైన ఎన్విడియా, ఆపిల్ వంటి కంపెనీల షేర్లు ఈ దెబ్బకు కుప్పకూలాయి. ఐరోపా దేశాలతో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో పెరిగింది. వాణిజ్య యుద్ధం తీవ్రమైతే ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా తీసుకున్న ఈ దూకుడు నిర్ణయం వల్ల అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పెట్టుబడిదారులు రిస్క్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. అందుకే సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, స్టాక్ మార్కెట్లు బేర్ గుప్పిట్లోకి వెళ్లాయి.
ట్రంప్ తీసుకుంటోన్న అనాలోచిత నిర్ణయాలు స్టాక్ మార్కెట్లపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి తమ నిధులను వేగంగా ఉపసంహరించుకుంటున్నారు. అమెరికా డాలర్ విలువ బలపడటంతో రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో క్షీణిస్తోంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై అదనపు భారాన్ని మోపుతోంది. నిఫ్టీ, సెన్సెక్స్ వంటి కీలక సూచీలు భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా భారత ఐటీ, ఫార్మా రంగాలు అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడటం వల్ల అక్కడి సుంకాల మార్పులు ఈ కంపెనీల ఆదాయాలను దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది. వీసా నిబంధనలు కఠినతరం చేస్తారనే వార్తలు సాఫ్ట్‌వేర్ రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న ప్రధాన శక్తిగా ట్రంప్ ఫ్యాక్టర్ మారింది. గ్రీన్‌లాండ్ కొనుగోలు ప్రతిపాదనను యూరప్ దేశాలు తిరస్కరించడం వల్ల మొదలైన ఈ వివాదం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరమైన చర్చలు విఫలమైతే వాణిజ్య యుద్ధం మరింత ముదిరి ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యానికి దారితీసే అవకాశం ఉంది. ప్రతి దేశం తన ప్రయోజనాలను కాపాడుకునే క్రమంలో దిగుమతి సుంకాలు పెంచితే అంతర్జాతీయ వాణిజ్యం స్తంభించిపోతుంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో భారత మార్కెట్లు నిలదొక్కుకోవాలంటే దేశీయ పెట్టుబడులు పెరగడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది.