ఏబీవీ రాజకీయ అవతారం...బొలిశెట్టి రంగంలోకి !
మాజీ డీపీపీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ఈ మధ్యనే తన భవిష్యత్తు ఆశలు ఆలోచనలు ఆకాంక్షలు అన్నీ చెప్పారు.;
మాజీ డీపీపీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ఈ మధ్యనే తన భవిష్యత్తు ఆశలు ఆలోచనలు ఆకాంక్షలు అన్నీ చెప్పారు. తాను తొందరలో రాజకీయ పార్టీని పెడతాను అని కూడా ఆయన ప్రకటించారు ఆరు పదుల వయసులో రాజకీయాల్లోకి రాకూడదా అని కూడా అన్నారు. తనకు ఇష్టమైన రంగం రాజకీయాలు కాబట్టి ప్రజా సేవ కోసం పూర్తి కాలం పనిచేస్తాను అన్నారు. తాను ఎవరి జేబులో బొమ్మను కానని చెబుతూ అన్ని పార్టీలు తమకు ఒక్కటే అన్నారు. మరోసారి ఏపీలో వైసీపీని రానీయమని కొసమెరుపు మెరిపించారు. ఇదిలా ఉంటే అమరావతి రాజధాని ఎందుకు ఆలస్యం అయింది అన్న దాని మీద తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఏబీవీ చేసిన వ్యాఖ్యలు అయితే ఏపీ రాజకీయాల్లో మంట పుట్టించాయి.
జనసేన నేతను లాగి :
అమరావతి రాజధానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు దాకా వైసీపీ అప్పట్లో కేసులు వేయించిందని అందులో విశాఖ నుంచి బొలిశెట్టి సత్యనారాయణ ఒకరు అంటూ ఏబీ చేసిన ఆరోపణల మీద బొలిశెట్టి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను వైసీపీ మనిషి అని చెప్పడం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. తాను వైసీపీకి వ్యతిరేకంగా పోరాడిన వాడిని అని ఆయన చెప్పారు.
బహిరంగ చర్చకు సవాల్ :
తన మీద అదే పనిగా చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఇక చాలు అని బొలిశెట్టి మీడియా ముఖంగానే స్పష్టం చేశారు. ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడదాం రండి అని అన్నారు అమరావతి రాజధాని విషయంలో తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం అని బొలిశెట్టి అన్నారు. అమరావతిలోనే రాజధానిగా ఉండాలని రైతుల పక్షాన నేను ఎప్పుడూ నిలబడ్డానని బొలిశెట్టి చెప్పారు. తాను వేసిన కేసులు కేవలం అమరావతి జరీబు భూములు, ఫ్లడ్ ప్లెయిన్స్ పర్యావరణ రక్షణ కోసం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.
కలుగులో దాక్కుంది మీరు :
ఇక వైసీపీ పాలనలో ఏబీ వెంకటేశ్వరరావు కలుగులో దాక్కున్న సమయంలో జగన్ ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడింది తాను అని బొలిశెట్టి చెప్పారు. మడ అడవుల రక్షణ కోసం ధైర్యంగా పోరాడింది కూడా తాను అని అన్నరు. అలాంటి తన మీద విమర్శలు చేయడమే కాకుండా జగన్ మనిషిని అని విమర్శలు చేయడమేంటి అని బొలిశెట్టి ఫైర్ అయ్యారు. సంస్కారం లేకుండా ఇలాంటి అసత్య ఆరోపణలు ఏబీవీ చేయడం తప్పు అని ఆయన ఖండించారు.
కట్టు కథలను పక్కన పెట్టి :
పర్యావరణ పరిరక్షణ రాజ్యాంగ రక్షణే తన ఏకైక లక్ష్యమని చెప్పిన బొలిశెట్టి ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించను అని పేర్కొన్నారు. ఏబీవీ కట్టు కథలను పక్కన పెట్టి తక్షణమే తనపైన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని బొలిశెట్టి డిమాండ్ చేశారు. లేదంటే మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని కోరారు. దానికి అనువైన సమయం వేదిక ఏబీవీ నిర్ణయించుకోవచ్చు అని చెప్పారు. మొత్తం మీద ఏబీవీ రాజకీయ రంగ ప్రవేశం అని చెబుతూ అమరావతి విషయంలో చేసిన వ్యాఖ్యలు బొలిశెట్టిని మధ్యలోకి తెచ్చిన తీరుతో సవాళ్ల పర్వం అయితే స్టార్ట్ అయింది. మరి ఏబీవీ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడతారా లేదా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.