మొన్న ఇచ్చిన మాట కోసం.. నేడు కార్యకర్త కోసం.. పవన్ ఏం చేశారంటే!
గత నెలలో తాను ఇచ్చిన మాట కోసం మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటంలో ఓ పెద్దావిడ కుటుంబాన్ని ఏపీ డిప్యూ టీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించిన విషయం తెలిసిందే;
గత నెలలో తాను ఇచ్చిన మాట కోసం మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటంలో ఓ పెద్దావిడ కుటుంబాన్ని ఏపీ డిప్యూ టీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో నిర్వహించిన జనసేనప్లీనరీ కోసం భూములు ఇచ్చారన్న కారణంగా ఇప్పటంలో ఇళ్లను కూల్చేశారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్.. అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సరస్వతమ్మ అనే పెద్దావిడ ఇంటికి వస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. డిప్యూటీ సీఎం అయిన తర్వాత.. ఆమె ఇంటికి వెళ్లారు.
అలానే.. ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడి కుటుంబాన్ని కూడా పరామర్శించి ధైర్యం చెప్పారు. ఉమ్మడి కృష్నాజిల్లాలోని కృత్తివెన్నుకు చెందిన జనసేన కార్యకర్త.. చందు వీరవెంకట వసంతరాయలు పార్టీలో యాక్టివ్‌గా ఉండేవారు. పవన్ కల్యాణ్ గెలుపు కోసం ఆయన ప్రత్యేక పూజలు చేయించి.. అప్పట్లో వార్తల్లోకి ఎక్కారు. అయితే.. ఆయన ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. దీంతో పార్టీ సభ్యత్వంతోపాటు బీమా కూడా చేయించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాయులు కుటుంబాన్ని కలిసి బీమా పరిహారం చెక్కుతో పాటు.. పార్టీ తరఫున కొంత ఆర్థిక సాయం కుటుంబానికి అందించారు.
ఇక, రాయులు పార్టీ కార్యకర్తగానే కాకుండా.. సామాజిక ఉద్యమ నేపథ్యం కూడా ఉన్న నేతగా గుర్తింపు పొందారు. తాను జీవించి ఉండగానే అవయవదానానికి ఒప్పుకొన్నారు. దీంతో ఆయన మరణానంతరం.. అవయవాలను సేకరించి ఆరుగురు అవసరమైన వ్యక్తులకు వాటిని అందించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వీరవెంకట వసంతరాయలు కుటుంబాన్ని అభినందించారు. రాయులుకు నివాళులర్పించారు. రాయులు మరణించినప్పటికీ ఆరుగురిలో సజీవంగా ఉంటారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కుటుంబసభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం తరఫున కూడా ఆదుకునేందుకు తనవంతు సాయం చేస్తానని.. కుటుంబంలో ఒకరి ఉద్యోగం లభించేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో రాయులు కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. మరోవైపు పవన్ కల్యాణ్‌ను చూసేందుకు వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. నిజానికి ఈ పర్యటనను చాలా గోప్యంగా నిర్వహించారు. అయినప్పటికీ.. అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తారు.