వైసీపీలో ఆ హాట్ సీటు కోసం వార‌సుల వార్‌...!

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వారసత్వ పోరు ముదురుతోంది.;

Update: 2026-01-22 06:19 GMT

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వారసత్వ పోరు ముదురుతోంది. నియోజకవర్గ స్థాయి నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు వారి వారసుల మధ్య ఆధిపత్య పోరుకు దారితీస్తున్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను కూడా గ్రూపుల వారీగా విడివిడిగా జర‌ప‌డం, పార్టీ కార్య‌క్ర‌మాలు ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టుగా నిర్వ‌హించ‌డం ఇక్క‌డ ప‌రిపాటి. మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు తమ రాజకీయ వారసులను క్షేత్రస్థాయిలో ప్రమోట్ చేసుకునే క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ పోరు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. కేడర్ కూడా ఎవరి వైపు ఉండాలో తెలియక అయోమయం, గంద‌ర‌గోళం అన్న‌ట్టుగా ఉన్నారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇప్ప‌టికే మాజీ ఎంపీ బుట్టా రేణుక, నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్‌ రెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల ఎర్రకోట రాజీవ్ రెడ్డిని పార్టీ ఇంచార్జ్ గా నియమించినప్పటి నుంచి ఈ గొడవలు మరింత ముదిరాయి. తన ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని భావిస్తున్న బుట్టా రేణుక వర్గం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భూకబ్జా ఆరోపణలు, వ్యక్తిగత దూషణలతో ఈ రెండు వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం నడుస్తోంది. ఒకరి అనుచరులపై మరొకరు కేసులు పెట్టుకునే వరకు ఈ వివాదం వెళ్లింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు పార్టీ పునాదులను దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఈ విభేదాలను పరిష్కరించేందుకు అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. తాడేపల్లిలో జరిగిన చర్చల తర్వాత కూడా నాయకులు తమ పంతాలను వీడటం లేదని తెలుస్తోంది. ఎర్రకోట కుటుంబం తమ వారసుడిని పక్కన పెట్టే ప్రసక్తే లేదని చెబుతుంటే, బుట్టా రేణుక తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌గా ఎవ‌రు ఉన్నా వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థిని తానే అని ఆమె చెప్పుకుంటున్నారు. దీనివల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వం రెండుగా చీలిపోయింది. పార్టీ నిర్వహించే ఆందోళన కార్యక్రమాలలో కూడా ఈ రెండు వర్గాలు వేర్వేరుగా పాల్గొంటున్నాయి. ఏకతాటిపైకి రాకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులకు లాభం జ‌రుగుతుంద‌ని పార్టీ నేత‌లు వాపోతున్నారు.

తెర‌పైకి మూడో కృష్ణుడు ఎంట్రీ... !

మంత్రాల‌యం ఎమ్మెల్యే బాల‌నాగిరెడ్డి కుమారుడు ధ‌ర‌ణీ రెడ్డి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానే ఎమ్మిగ‌నూరు వైసీపీ అభ్య‌ర్థిని అని ప్ర‌క‌టించుకుంటున్నారు. ఎమ్మిగ‌నూరు అసెంబ్లీ సీటు ఇస్తే సీనియ‌ర్ల‌కు ఇవ్వాల‌ని.. రాజీవ్ రెడ్డి పోటీ చేస్తే తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించి పార్టీలో క‌ల‌క‌లం రేపారు. చెన్న‌కేవ‌శ రెడ్డి లేదా లింగాయ‌త్ కార్పొరేష‌న్ మాజీ ఛైర్మ‌న్ రుద్ర‌గౌడ్‌కు సీటు ఇచ్చినా ఓకే కాని.. రాజీవ్ రెడ్డికి సీటు ఇస్తే తాను పోటీలో ఉంటాన‌ని శ‌ప‌థాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే బాల‌నాగిరెడ్డి ఫ్యామిలీ నుంచి న‌లుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మ‌రో అదే ఫ్యామిలీ నుంచి జ‌గ‌న్ ఐదో వ్య‌క్తికి సీటు ఇస్తారా ? ఎమ్మిగ‌నూరు వైసీపీ సీటు వ్య‌వ‌హారం ఎటు మ‌లుపులు తిరుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News