దావోస్ వెళ్లి మారిన మనిషి... ఈయూ విషయంలో ట్రంప్ వెనక్కి..!
అవును... గ్రీన్ ల్యాండ్ ను తీసుకునే విషయంలో తమకు మద్దతు తెలపని ఈయూ దేశాలపై అమెరికా అధ్యక్షుడు సుంకాల దాడి షురూ చేసిన సంగతి తెలిసిందే.;
ఆరు నూరైనా, నూరు ఆరైనా గ్రీన్ ల్యాండ్ అనే అందమైన మంచు ముక్క తమకు కావాలని.. జాతీయ, అంతర్జాతీయ భద్రత దృష్ట్యా ఇది అనివార్యమని.. గ్రీన్ ల్యాండ్ అమెరికా భూభాగమని చెప్పుకొచ్చిన ట్రంప్.. తదనుగుణంగా ఏఐ మ్యాప్ లు సృష్టించి సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ట్రంప్.. ఈ విషయంలో తమకు మద్దతు తెలపని ఈయూ దేశాలపై సుంకాల వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. దావోస్ వెళ్లిన తర్వాత మారిపోయారు. ఈ సందర్భంగా ఆసక్తికర ప్రకటన చేశారు.
అవును... గ్రీన్ ల్యాండ్ ను తీసుకునే విషయంలో తమకు మద్దతు తెలపని ఈయూ దేశాలపై అమెరికా అధ్యక్షుడు సుంకాల దాడి షురూ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి 10%, జూన్ 1 నుంచి 25% సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా దావోస్ లో ప్రసంగిస్తూ... గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకునే విషయంలో తాను బలప్రయోగం చేయాల్సిన అవసరం లేదని.. తాను బలప్రయోగం చేయాలనుకోవడం లేదని.. బలప్రయోగం చేయనని అన్నారు.
దీంతో... గ్రీన్ ల్యాండ్ విషయంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారా అనే చర్చ మొదలైంది. సరిగ్గా ఈ సమయంలో.. ఈయూ దేశాలపై విధించిన సుంకాల విషయంలోనూ ట్రంప్ వెనక్కి తగ్గారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. తాజాగా ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టిన ట్రంప్... నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో చాలా ఫలప్రదమైన చర్చలు జరిగాయని.. గ్రీన్ ల్యాండ్, ఆర్కిటిక్ ప్రాంత భవిష్యత్తు ఒప్పందానికి ఓ ఫ్రేమ్ వర్క్ రూపొందించామని తెలిపారు.
ఇది కార్యరూపం దాల్చితే అమెరికాతో పాటు నాటో మిత్ర దేశాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. అందువల్లే.. సుంకాలపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన సుంకాలను విధించడం లేదని తెలిపారు. ఇదే సమయంలో.. 'గోల్డెన్ డోమ్' నిర్మాణం పైనా చర్చలు కొనసాగుతున్నాయని.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ లు దీనికి సంబంధించిన చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు.
దీంతో.. ఈ విషయం ఆసక్తిగా మారింది. ట్రంప్ తాజా నిర్ణయాన్ని పలువురు ఈయూ దేశాధి నేతలు స్వాగతిస్తున్నారు. ఇందులో భాగంగా... ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్సే లోకే రాస్ ముసెన్ స్వాగతించారు. ఇది చాలా సానుకూలమైన పరిణామంగా పేర్కొన్నారు.
కాగా... బుధవారం దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో ఆరు సంవత్సరాల తర్వాత తన తొలి ప్రసంగంలో.. గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకోవడానికి తక్షణ చర్చలు కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. డెన్మార్క్ నుండి గ్రీన్ ల్యాండ్ ను అమెరికా తన ఆధీనంలోకి తీసుకునేందుకు అనుమతించాలని ఆయన ప్రపంచ నాయకులను కోరారు. ఈ సమయంలో.. మీరు అవును అని చెప్పవచ్చు, మేము చాలా కృతజ్ఞులమై ఉంటాము.. లేదా మీరు కాదు అని చెప్పవచ్చు, మేము గుర్తుంచుకుంటాము అని వ్యాఖ్యానించారు.