బుమ్రా రీఎంట్రీ: సూపర్‌స్టార్ వచ్చాడు సరే... ఆ ‘పాత పదును’ ఎక్కడ?

భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. టీమ్ ఇండియా ‘యార్కర్ కింగ్’ జస్ప్రీత్ బుమ్రా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు.;

Update: 2026-01-22 06:17 GMT

భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. టీమ్ ఇండియా ‘యార్కర్ కింగ్’ జస్ప్రీత్ బుమ్రా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. కానీ, పునరాగమనం ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో బుమ్రా ప్రదర్శన చూస్తుంటే.. వరల్డ్ కప్ ముంగిట భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ డెత్ ఓవర్ల బౌలర్‌గా పేరుగాంచిన జస్ప్రీత్ బుమ్రా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. కానీ, ఈ రాక అభిమానుల్లో ఉత్సాహం కంటే ఆందోళననే ఎక్కువగా మిగిల్చింది. గాయం నుంచి కోలుకుని, సుదీర్ఘ విరామం తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో బరిలోకి దిగిన బుమ్రా.. తన స్థాయికి తగని ప్రదర్శనతో నిరాశపరిచాడు.

ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు

సుదీర్ఘ కాలం గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా, నాగ్‌పూర్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే బుమ్రా మార్క్ బౌలింగ్ కోసం వేచి చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. తన కోటాలోని 3 ఓవర్లలో 30 పరుగులు సమర్పించుకున్న బుమ్రా, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆయన ఎకానమీ రేటు 10.00గా నమోదవ్వడం గమనార్హం. సాధారణంగా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసే బుమ్రా, ఇలా పరుగులివ్వడం ఆయన ‘రస్టీనెస్’కు అద్దం పడుతోంది.

మిస్సైన ‘బుమ్రా మార్క్’ కచ్చితత్వం

గాయం నుంచి కోలుకున్నాక ఆటగాళ్లకు లయ దొరకడం కష్టమే. కానీ బుమ్రా విషయంలో సమస్య అంతకంటే లోతుగా కనిపిస్తోంది. గతంలో బ్యాటర్లను వణికించే యార్కర్లు, స్లోయర్ బంతులు ఈ మ్యాచ్‌లో కనిపించలేదు. సరైన లెంగ్త్‌లో బంతులు వేయలేకపోవడంతో కివీస్ బ్యాటర్లు బుమ్రాపై ఎదురుదాడికి దిగారు. మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల బౌలింగ్‌లో పదును తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘‘సాధారణంగా విరామం తర్వాత వచ్చే ఆటగాళ్లకు సమయం పడుతుంది. కానీ వరల్డ్ కప్ ముంగిట ఇలాంటి ప్రదర్శన జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది." అని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు..

వరల్డ్ కప్ ముంగిట పెను సవాలు

మరో కొన్ని రోజుల్లోనే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. భారత బౌలింగ్ విభాగానికి బుమ్రా వెన్నెముక వంటివాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బుమ్రా ఇచ్చే భరోసా మరే ఇతర బౌలర్ ఇవ్వలేడు. ప్రస్తుత పరిస్థితుల్లో బుమ్రా త్వరగా ఫామ్‌లోకి రాకపోతే డెత్ ఓవర్ల బౌలింగ్ బలహీనపడే అవకాశం ఉంది. విరామం తర్వాత వచ్చిన జంగు వదిలించుకోవడానికి ఆయనకు మరిన్ని మ్యాచ్‌లు అవసరం. కానీ సమయం మాత్రం చాలా తక్కువగా ఉంది.

‘జస్సీ’ కమ్‌బ్యాక్ అవసరం!

బుమ్రా తన అనుభవంతో తిరిగి పుంజుకుంటాడనే నమ్మకం అందరిలోనూ ఉంది. అయితే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్లు బుమ్రాను టార్గెట్ చేసే ప్రమాదం ఉంది. ఒకవేళ బుమ్రా తన పాత వేగాన్ని, కచ్చితత్వాన్ని తిరిగి పొందలేకపోతే అది టీమ్ ఇండియా ప్రపంచకప్ కలపై ప్రభావం చూపవచ్చు. సూపర్‌స్టార్ తిరిగి వచ్చాడు.. ఇప్పుడు ఆయన ‘ఫామ్’ కూడా తిరిగి రావాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News