మునిసిపల్ ఎన్నికలు: కాంగ్రెస్-బీఆర్ఎస్ ఆయుధాలు ఇవేనట!
ఇక, ఎన్నికల పోలింగ్ నిర్వహణపైనా అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. నేడో రేపో.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని.. ప్రకటన చేయనున్నారు.;
త్వరలోనే తెలంగాణలో మునిసిపల్, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఓటర్ల జాబితాను కూడా రాష్ట్ర ఎన్నికల అధికారులు విడుదల చేశారు. ఇక, ఎన్నికల పోలింగ్ నిర్వహణపైనా అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. నేడో రేపో.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని.. ప్రకటన చేయనున్నారు. ఇదిలావుంటే.. ఈ ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇటు అధికార పార్టీ కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ కూడా.. సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని ఇరు పార్టీలు కూడా ప్రకటించాయి. మరో వైపు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌పైనా కసరత్తు జరుగుతోంది.
ఇదిలావుంటే.. ఎన్నికలు ఏవైనా ఆయుధాలు రెడీ చేసుకోవడం.. రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలో అధికార పార్టీ కాంగ్రెస్ రెండడుగులు ముందే ఉందని చెప్పాలి. గత కేసీఆర్ సర్కారు వైఫల్యాలతోపాటు.. సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తోంది. 117 మునిసిపాలిటీలలో నియోజకవర్గాల వారీగా.. జిల్లాల వారీగా కూడా కమిటీలను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించాలని భావిస్తున్నారు. ఇక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా.. ప్రచారానికి ఇప్పటికే శ్రీకారం చుట్టేశారు. తమ సానుకూల అంశాలతోపాటు.. బీఆర్ ఎస్ వైఫల్యాలను ఆయన ప్రధాన అజెండాగా చేసుకుంటున్నారు.
ఇక, ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ ఎస్ కూడా మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బలమైన వ్యూహంతోనే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది, దీనిలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న జిల్లాల ఏర్పాటు అంశాన్ని... ప్రజల సెంటిమెం టును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రజల సెంటిమెంటును పట్టించుకోకుండా జిల్లాల విభజన చేస్తున్నారని.. దీనిని పెద్ద ఎత్తున ప్రజల మధ్యకు తీసుకువెళ్తామన్నారు. ఇదే సమయంలో కల్యాణలక్ష్మి, రైతు భరోసా వంటి తమ హయాంలో అమలైన పథకాలను కూడా ప్రజలకు వివరించనున్నారు.
అయితే.. గత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా.. ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేయడం వల్ల.. గత ఏడాది జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రూటు మార్చి కేసీఆర్ హయాంలో జరిగిన మంచిని కూడా వివరిస్తామని చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో నీటి వివాదాలను.. రేవంత్ రెడ్డి ఏపీకి చేస్తున్న మేళ్లను కూడా ప్రజలకు వివరించేందుకు కేటీఆర్ సహా బీఆర్ ఎస్ నాయకులు సిద్ధమయ్యారు. ఇదిలావుంటే.. అసలుపెద్ద నేత కేసీఆర్ బయటకు వస్తారో.. రారో చూడాలి. ఇక, ఇప్పటికైతే మునిసిపల్ ఎన్నికలకు కావాల్సిన ఆయుధాలు ఇరు పార్టీలకు లభించాయి. నోటిఫికేషన్ రావడమే తరువాయి.. అన్నధోరణితో ఉన్నాయి.