భారత్ టెక్ పవర్ హౌజ్ గా ఎదిగేందుకు భారీ పెట్టుబడులు..

కానీ ఆ మేథస్సును సాంకేతిక ఆవిష్కరణలుగా మార్చడంలో మనం వెనుకబడి ఉన్నాం. ఆ లోటును భర్తీ చేయడమే ఈ కొత్త పరిశోధనాభివృద్ధి నిధి లక్ష్యం.;

Update: 2025-11-03 11:27 GMT

భారత్ అంటే ఇప్పుడు కేవలం జనసాంద్రతలోనే కాదు, ఆలోచనల్లోనూ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని భావిస్తోంది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన రూ.లక్ష కోట్ల పరిశోధనాభివృద్ధి నిధి ఆ దిశలో ఒక కొత్త అధ్యాయానికి తెర తీసింది. ఇది కేవలం ప్రభుత్వ ప్రకటన కాదు ఇది పరిశోధన శక్తి ద్వారా దేశ భవిష్యత్తును పునర్నిర్మించాలన్న సంకల్పానికి సంకేతం. మోదీ ప్రసంగంలోని ప్రధాన సందేశం స్పష్టంగా ఉంది. ‘భారత్‌ వినియోగదారుల దేశం నుంచి సృష్టికర్తల దేశంగా మారాలి.’ ఇది కేవలం మాట కాదు.. దశాబ్దాలుగా మనం ఎదురుచూస్తున్న మార్పు. ప్రపంచంలో అత్యుత్తమ మేధస్సు ఉన్న దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది. కానీ ఆ మేథస్సును సాంకేతిక ఆవిష్కరణలుగా మార్చడంలో మనం వెనుకబడి ఉన్నాం. ఆ లోటును భర్తీ చేయడమే ఈ కొత్త పరిశోధనాభివృద్ధి నిధి లక్ష్యం.

ఆవిష్కరణ కర్తలకు పిలుపు..

కొన్నేళ్లలో భారత్‌ పరిశోధన వ్యయం దాదాపు రెట్టింపు చేసింది. ఈ పెరుగుదల కేవలం నంబర్లుకాదు.. అర్థం మరింత లోతైంది. ఆర్థిక పెట్టుబడి అంటే కేవలం సంఖ్య కాదు.. అది నమ్మకం. ప్రభుత్వం ఇప్పుడు ఆ నమ్మకాన్ని శాస్త్రవేత్తలపై, విశ్వవిద్యాలయాలపై, యువ ఆవిష్కర్తలపై ఉంచుతోంది. లక్ష కోట్ల నిధి ద్వారా మోదీ ప్రభుత్వం రెండు ప్రధాన దిశల్లో ముందుకు వెళ్తోంది. ఒకటి, ప్రైవేట్‌ రంగాన్ని పరిశోధనల్లో భాగస్వామ్యం చేయడం. రెండోది, విద్యా సంస్థలతో పరిశ్రమల అనుసంధానం పెంచడం.

కొత్త యుగానిక వేదికగా భారత్..

‘అనుసంధాన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ కొత్త యుగానికి వేదికగా నిలుస్తోంది. ఇది కేవలం ఫండింగ్‌ ఏజెన్సీ కాదు. యూనివర్సిటీల ఆవిష్కరణలను పరిశ్రమలకు కలిపే వేదిక. ఈ మార్గంలో ప్రయాణించే భారత్‌ ఇకపై ‘ల్యాబ్‌ నుంచి మార్కెట్‌’ దాకా తాను సృష్టించిన సాంకేతికతను ప్రపంచానికి అందించే స్థాయికి చేరుకుంటుంది. భారత్‌ పరిశోధనలలో ప్రైవేట్‌ పెట్టుబడి తక్కువగా ఉండడం చాలా కాలం నుంచి చర్చనీయాంశం. అమెరికా, చైనా, జపాన్‌ వంటి దేశాలు తమ ఆర్థిక వృద్ధికి మూలంగా ఆవిష్కరణలను చేసుకున్నాయి. మనం అదే దిశగా నడవాలంటే ప్రభుత్వ నిధులు మాత్రమే కాదు.. కార్పొరేట్‌ ప్రపంచం కూడా ముందుకు రావాలి. మోదీ ప్రసంగంలోని సారాంశం కూడా అదే. ‘ప్రభుత్వం మార్గం చూపుతుంది, కానీ శక్తి సమాజం నుంచే రావాలి.’ అన్నారు ప్రధాని.

ప్రతి విభాగంలోనూ విజయమే..

ఇస్రో విజయాలు, చంద్రయాన్‌–3, సూర్యయాన్‌ వంటి మిషన్లు భారత్‌లోని శాస్త్ర సామర్థ్యానికి ఉదాహరణ. కానీ ఇప్పుడు సవాలు మరోటి.

అంతరిక్షం నుంచి బయోటెక్నాలజీ వరకు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి గ్రీన్‌ ఎనర్జీ వరకు ప్రతి రంగంలో భారత్‌ తన ముద్ర వేయాలి. అందుకు ఆవిష్కరణ వాతావరణం సహకారం మీద నడవాలి, పోటీ మీద కాదు. అని మోడీ అన్నారు. మోదీ చెప్పిన మరో ముఖ్యమైన అంశం ‘పరిశోధన అనేది భవిష్యత్‌ తరాలపై పెట్టుబడి’ అని. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశకు తీసుకెళ్తుంది. మన యువత సామర్థ్యం, స్టార్టప్‌ల దూకుడు, గ్లోబల్‌ మార్కెట్లను ఆకర్షించే మన ప్రతిభ ఇవన్నీ కలిస్తేనే భారత్‌ నిజమైన టెక్‌ పవర్‌హౌస్‌గా మారుతుంది.

భారత్‌ ఇప్పటికే ‘సర్వీస్‌ ఎకానమీ’ నుంచి ‘ఇన్నోవేషన్‌ ఎకానమీ’ దిశగా అడుగులు వేస్తోంది. డిజిటల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా వంటి కార్యక్రమాలు ఈ సాంకేతిక విప్లవానికి పునాది వేశాయి. ఇప్పుడు ఈ పరిశోధనాభివృద్ధి నిధి వాటిని ఒకే రేఖలో కలిపే ప్రయత్నం చేసేందుకే అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

భారత్‌ వేదికపై ప్రారంభమైన ఈ ఫండ్‌ ఒక భారీ సంకల్పానికి ప్రతిరూపం. ‘భవిష్యత్‌ను కొనడం కాదు.., సృష్టించడం.’ ప్రైవేట్‌ రంగం, విద్యా సంస్థలు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వం అందరూ ఒకే దిశగా కలిసి నడిస్తే, ఈ శతాబ్దం భారత్‌ శతాబ్దంగా నిలుస్తుంది. సంక్షేపంగా చెప్పాలంటే, మోదీ చూపిస్తున్న మార్గం నేడు దేశానికి అవసరమైన సత్యం.ఆవిష్కరణ లేకుండా అభివృద్ధి లేదు. భారత్‌ తన టెక్నాలజీ శక్తిని ప్రపంచానికి చూపించాలంటే, ఈ ‘రూ.లక్ష కోట్ల ఆలోచన’ మొదటి అడుగే కావాలి.

Tags:    

Similar News