తమిళనాడు ఎన్నికలు... కాంగ్రెస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చిన స్టాలిన్...!
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల వేళ మిత్రపక్షం కాంగ్రెస్‌కు అదిరిపోయే షాక్ ఇచ్చారు.;
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల వేళ మిత్రపక్షం కాంగ్రెస్‌కు అదిరిపోయే షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షాలతోనూ ఎన్నికల వరకే పొత్తు ఉంటుందని.. పాలనలో కాదని తేల్చిచెప్పారు. స్టాలిన్ చేసిన ఈ ప్రకటనపై కాంగ్రెస్ మండిపడుతోంది. తమిళనాడులో కాంగ్రెస్ + డీఎంకే గత కొంత కాలంగా దోస్తులుగా ఉంటున్నాయి. ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని.. కాంగ్రెస్‌కు కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం వరకు ఓకే కాని... వాళ్లకు పాలనలో భాగస్వామ్యం ఉండదని.. ఎలాంటి మంత్రి పదవులు ఇవ్వబోమని స్టాలిన్ క్లారిటీ ఇచ్చేసినట్లయ్యింది.
కాంగ్రెస్‌తో స్నేహం అనేది కేవలం పోత్తుల వరకు మాత్రమే అని.. వారికి పవర్ షేరింగ్ కాని.. మంత్రి పదవులు ఇవ్వడం కాని స్టాలిన్‌కు ఎంత మాత్రం ఇష్టం లేదు. అలాగే కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుంది.. కానీ వాళ్లకు ఎలాంటి మంత్రి పదవులు ఇవ్వదు.. వారికి పాలనలో ఎలాంటి భాగస్వామ్యం కూడా ఉండదు. ఇప్పుడు స్టాలిన్ ఇక్కడ కాంగ్రెస్‌కు అదే రూల్ వర్తింపజేస్తున్నారు. డీఎంకే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్టాలిన్ చెప్పడంతో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి.
అయితే కాంగ్రెస్ డీఎంకే కూటమిలో ఉంటుందని స్టాలిన్ చెప్పారు. స్టాలిన్ కాంగ్రెస్‌కు పవర్ షేరింగ్ ఉండదని చెప్పడంతో పొత్తు ఉంటుందా ? ఉండదా ? అన్నదానిపై కొత్త సందేహాలు ముసురుకుంటున్నాయి. 2021లో డీఎంకే ఓడిపోయిన సీట్లనే తాము కోరుకుంటున్నామని కాంగ్రెస్ చెపుతోంది. తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 170 సీట్లలో తాము పోటీ చేస్తామని డీఎంకే చెపుతోంది. అయితే 2021లో డీఎంకే 170 సీట్లలో పోటీ చేసి 133 సీట్లలో విజయం సాధించింది.. ఆ గెలవని సీట్లు మాకు కావాలని కాంగ్రెస్ అడుగుతోంది. ఇక అదే ఎన్నికల్లో 25 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ 18 సీట్లు గెలుచుకుంది.
అయితే ఇప్పుడు స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయంతో డీఎంకే - కాంగ్రెస్ పొత్తు పై ఏం జరుగుతుందన్న ఉత్కంఠ తమిళ రాజకీయాల్లో ఏర్పడింది. ఇక దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమన్వయం చేసుకుంటూ స్టాలిన్ తన పరిధిని విస్తరిస్తున్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రాల స్వయంప్రతిపత్తి దెబ్బతింటోందని పదే పదే వాదిస్తోన్న స్టాలిన్ మరోసారి తమిళనాడులో అధికారంలోకి రావడం ద్వారా బలంగా పాతుకుపోవాలని చూస్తున్నారు.