వీసా ప్రక్రియలో ఒక చిన్న తప్పు.. విద్యార్థి జీవితాన్ని ఆగం చేసిందా..?

ఇది గ్రహించిన విద్యార్థికి వీసా ప్రక్రియపై భయం మొదలైంది. ఒక లింక్ కూడా అమెరికా వీసా ఇంటర్వ్యూలో ఎంత ప్రాధాన్యమైనదో తెలియజేసే ఘటన ఇది.;

Update: 2025-11-18 13:30 GMT

ఇండియాపై అమెరికా తీసుకుంటున్న చర్యలో.. రష్యాతో ఆయిల్ కొనుగోలో.. ఇండియా మాట వినడం లేదనో.. కారణం ఏదైనా.. భారతీయుల విషయంలో అమెరికా వ్యవహారం భిన్నంగా మారిపోయింది. హెచ్-1బీ వీసాలను భారీగా తొలగించిన వైట్ హౌజ్.. మళ్లీ పునరుద్ధరిస్తామని చెప్పుకుంటుంది. పైగా వీసా ప్రక్రియను మరింత కఠినంగా మార్చింది. అమెరికా వీసా ప్రక్రియ ఎంత కఠినంగా మారిందో.. ఒక చిన్న పొరపాటు కూడా ఎంత పెద్ద ఆందోళనగా మారగలదో ఇటీవల ఒక సాధారణ F-1 విద్యార్థి అనుభవం స్పష్టం చేసింది. సియోల్‌లో డిసెంబర్ లో వీసా రెన్యువల్‌ ఇంటర్వ్యూకు సిద్ధమవుతున్న ఒక విద్యార్థి.. తన డీఎస్-160 ఫారంలో కొన్ని పాత సోషల్ మీడియా అకౌంట్లను ముఖ్యంగా ‘LinkedIn’ వంటి ప్రొఫెషనల్ పేజీలను చేర్చకుండా వదిలేశాడు. ఇది గ్రహించిన విద్యార్థికి వీసా ప్రక్రియపై భయం మొదలైంది. ఒక లింక్ కూడా అమెరికా వీసా ఇంటర్వ్యూలో ఎంత ప్రాధాన్యమైనదో తెలియజేసే ఘటన ఇది.

వీసాలో కొత్త రూల్స్..!

2025 తర్వాత అమెరికా రాయబార కార్యాలయాలు తీసుకొచ్చిన నూతన నిబంధన ప్రకారం.. దరఖాస్తుదారులు ఐదేళ్లలో వాడిన ప్రతి సోషల్ మీడియా అకౌంట్‌ను తప్పనిసరిగా అప్లికేషన్ లో చూపించాలి. అది యాక్టివ్ అవ్వాలి అన్న నియమం కాదు.. అకౌంట్ పాతది అయినా, వాడడం నిలిపివేసినా, లాగిన్ వివరాలు మర్చిపోయినా అది కూడా పేర్కొనాలి. ఈ నియమం వీసా వ్యవస్థలో కీలక మార్పును తెచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా కేవలం వ్యక్తిగత అభిరుచుల ప్రతిబింబం కాదు.. అది అమెరికా వీసా ఆమోదానికి సంబంధించిన అవకాశాలను ప్రభావితం చేసేదిగా మారిపోయింది. సదరు విద్యార్థి కేసు కూడా ఇదే నేపథ్యంతో సమస్యలా అనిపించింది. రాజకీయపరమైన పోస్టులు లేవని తెలిసినా.. ఏ చిన్న లోపం కూడా ‘misrepresentation’ కింద పరిగణించబడుతుందేమో అన్న ఆందోళన అతడిని వెంటాడింది.

డీఎస్-160 ఫారమ్

డీఎస్-160 ఫారమ్‌లో మరో సమస్య.. ఒకసారి వీసా అపాయింట్‌మెంట్ బుక్ చేసిన తర్వాత ఫారంను సవరించడం సాధ్యం కాదు. ఏదైనా తప్పు తీరని శాస్త్రీయ వాస్తవంలా అక్కడే నిక్షిప్తం అవుతుంది. మార్పులు చేయాలంటే అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ చేసి, మళ్లీ ఫీజు చెల్లించి ప్రారంభం నుంచి పనిని మొదలుపెట్టాలి. ఈ గందరగోళ పరిస్థితిలో విద్యార్థి దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. మళ్లీ ఫారం ఫిల్ చేస్తే సమయం, డబ్బు నష్టం. అలాగే ఇంటర్వ్యూలో ‘మిస్సయిన సోషల్ మీడియాను’ వివరిస్తే వీసా ఆఫీసర్ అంగీకరిస్తాడా..? పాత అనుభవాలు చెబుతున్నాయి. కొన్ని సార్లు అధికారులు వర్బల్ క్లారిఫికేషన్‌ను అంగీకరిస్తారు. కానీ 2025 తర్వాత వచ్చిన నిబంధనల నేపథ్యంలో ఆ సడలింపు ఇంకా కొనసాగుతుందా అన్నది అతడికి తెలియదు.

విద్యార్థుల మానసిక ఒత్తిడి

ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు అమెరికా విద్యను కలగంటారు. కానీ ఇప్పుడు వీసా ప్రక్రియలో జరిగిన కొత్త మార్పులు, సామాజిక మాధ్యమ పర్యవేక్షణ, కఠినతరం చేసిన స్క్రీనింగ్ వ్యవస్థ విద్యార్థులకు అదనపు మానసిక ఒత్తిడిని తెచ్చాయి. ఒక చిన్న LinkedIn అకౌంట్ మర్చిపోవడం కూడా వీసా రద్దుకు కారణమవుతుందేమో అధికారికంగా చెప్పకపోయినా, విద్యార్థుల మనసుల్లో ఉద్రిక్తత పెరుగుతోంది.

మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు వీసా అనిశ్చితి అనేది చదువులో పెట్టుబడి మాత్రమే కాదు.. అది కుటుంబ ఆశలు, రుణభారం, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ఈ చిన్న తప్పు విద్యార్థికి అనవసరమైన ఉద్వేగ భరిత రోజులను తెచ్చింది. ‘వీసా ఆఫీసర్ చూసే ప్రతి విషయం సరైనదా?’ అనే ప్రశ్న ఇప్పుడు వారి రోజువారీ ఆలోచనల్లో ఒక శాశ్వతంగా మారింది.

టెక్నాలజీ పరిణామం

సోషల్ మీడియాలో ప్రతిరోజూ మనుషులు కొత్త కొత్త అకౌంట్‌లు తెరిచి, పాతవాటిని విడిచిపెడుతుంటారు. ఇది సహజం.. కానీ అమెరికా వీసా వ్యవస్థ ఇప్పుడు ఈ సహజత్వాన్ని ఒక విధమైన ‘ప్రమాదం’గా చూస్తోంది. ఒక అకౌంట్ వాడడం మానేయడం కూడా ఓ సమాచార లోపం అవుతుంది. టెక్నాలజీ వేగంగా మారుతున్నా, ఇమ్మిగ్రేషన్ పద్ధతులు మాత్రం ఆ వేగాన్ని అందుకోలేదు. ఈ మధ్యలో ఇలాంటి విద్యార్థులు చిక్కుకొని పోతారు..

వ్యవస్థలో స్పష్టత లేకపోవడం

వర్బల్ క్లారిఫికేషన్ అనుమతించాలా? పాత అకౌంట్ చెప్పకపోతే misrepresentation అవుతుందా? LinkedIn లేకపోయినా సమస్యా? డీఎస్-160 ఫారమ్ మళ్లీ రీఫైల్ తప్పదా? ఇవన్నీ స్పష్టంగా చెప్పే మార్గదర్శకాలు లేవు. ఈ లోపం అమెరికా వీసా వ్యవస్థలోని పెద్ద సమస్యగా మారుతుంది. నిబంధనలు కఠినం చేస్తారు.. కానీ వాటి అమలుకు సంబంధించిన స్పష్టత ఇవ్వరు. ఫలితంంగా విద్యార్థులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు.

Tags:    

Similar News