మిస్ వరల్డ్: వేదికపైకి తొలుత మిస్ అర్జెంటీనా.. చివరన?

నేపాల్ కు చెందిన మిస్ నేపాల్ వరల్డ్ గులాబీ డిజైన్.. అదే రంగు జాకెట్ తో తెలుపు రంగు చీరకట్టుతో వచ్చారు.;

Update: 2025-05-11 05:14 GMT

ఓవైపు భారత - పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు. మరోవైపు కాల్పుల విరమణకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడిన వేళలోనే.. హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా సాగింది. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం మొదలు కావటమే కాదు.. ముందే ప్లాన్ చేసిన 150 నిమిషాల్లో ( రెండున్నర గంటలు) కార్యక్రమం ముగిసింది. మొత్తం 109 దేశాలకు చెందిన సుందరీమణులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఖండాల వారీగా అందగత్తెలను ఆహ్వానించారు. మొత్తం నాలుగు ఖండాలుగా చేసి.. ఆయా ఖండాల్లోని దేశాల వారీగా మిస్ బ్యూటీల్ని వేదిక మీదకు ఆహ్వానించారు.

ఈ క్రమంలో తనను తాను పరిచయం చేసుకునే అవకాశం మొదట మిస్ అర్జెంటీనాకు దక్కింది. ఖండాల వారీగా ప్రదర్శన నిర్వహించగా.. కరీబియన్ లాటిన్ అమెరికా దేశాలకు చెందిన పోటీదారుల పరిచయంతో ప్రదర్శన మొదలైంది. ఇందులో మొదట మిస్ అర్జెంటీనాకు దక్కగా.. చివరన మిస్ మెనిజువెలా మెరిశారు. రెండో విడతలో ఆఫ్రికన్ దేశాల సుందరీమణులు వేదిక మీదకు వచ్చారు. మొత్తం 22 మంది మిస్ బ్యూటీలు ఆఫ్రికా ఖండం నుంచి ప్రాతినిధ్యం వహించారు.

ఆ తర్వాత యూరోప్.. చివరన ఆసియా ఖండానికి చెందిన మిస్ బ్యూటీలు వేదిక మీదకు వచ్చారు. యూరోప్ నుంచి 32 దేశాల బ్యూటీలు రాగా.. ఆసియా ఖండం నుంచి 22 దేశాలకు చెందిన అందగత్తెలు ప్రాతినిధ్యం వహించారు. ఆఫ్రికా ఖండంలోని దేశాల నుంచి ప్రాతినిధ్యం వహించిన సుందరీమణుల్లో తొలుత మిస్ అంగోలాకు అవకాశం లభించగా.. చివరన జింబాబ్వే దేశానికి చెందిన పోటీదారు వేదిక మీదకు వచ్చారు.

చివరి టీంగా ఆసియా ఖండంలోని వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు వేదిక మీదకు వచ్చారు. ముఖ్యంగా మిస్ ఇండియా వరల్డ్ నందినీ గుప్తా స్టేడియం మీదకు వచ్చినప్పుడు స్టేడియం ప్రాంగణం మొత్తం చప్పట్లు.. ఈలలు.. కేరింతలతో మార్మోగింది. గోకులంలో గోపిక వస్త్రధారణతో నందినీ గుప్తా వచ్చారు. వేషధారణకు తగ్గట్లు తన పరిచయంలో భాగంగా ఆమె కవ్వంతో వెన్న చిలికే అభినయంతో వచ్చారు.

నేపాల్ కు చెందిన మిస్ నేపాల్ వరల్డ్ గులాబీ డిజైన్.. అదే రంగు జాకెట్ తో తెలుపు రంగు చీరకట్టుతో వచ్చారు. థాయిలాండ్ కు చెందిన మిస్ బ్యూటీ కూడా చీరకట్టుతో హాజరయ్యారు. ఆసియా ఖండం నుంచి ప్రాతినిధ్యం వహించే సుందీమరణుల్లో చివరన మిస్ వియత్నాం వచ్చారు. మిగిలిన వారికి భిన్నంగా మిస్ ఆస్ట్రేలియా మాత్రం కౌబాయ్ గెటప్ లో వచ్చి మిగిలిన బారికి భిన్నంగా నిలిచారు.

పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. నిజానికి భారత - పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని భావించారు. అనూహ్యంగా కాల్పుల విరమణ ఒప్పందం వివరాలు రావటంతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్ పర్సన్ జూలియా మోర్లే.. ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టీనా పిస్కోవాలు తమను తాము ముఖ్యమంత్రి రేవంత్ ను పరిచయం చేసుకొని కరచాలనం చేశారు. ఈ ఇద్దరితో కలిసి ప్రపంచసుందరి 72వ ఎడిషన్ పోటీలు ప్రారంభమైనట్లుగా సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆహుతులు.. పోటీదారుల కరతాళ ధ్వనులతో స్టేడియం మార్మోగింది.

పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత పోటీదారులు అంతా స్టేడియంలోకి వారి వారి జాతీయ జెండాలను చేతపట్టుకొని ఊపుతూ వచ్చారు. చివరగా పతాకాన్ని చేతబూని మిస్ ఇండియా వరల్డ్ నందినీ గుప్తా వేదిక మీదకు వచ్చారు. అప్పుడు స్డేటియంలోని ప్రేక్షకులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో స్వాగతం పలకటం అందరిని ఆకర్షించింది. ప్రపంచ శాంతిని కాంక్షించే మిస్ వరల్డ్ గీతాన్ని అలపించారు. భారత దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో అసమాన ప్్రదర్శన చాటిన సైనికులకు వందనం సమర్ఫిస్తున్నట్లుగా వ్యాఖ్యత ప్రకటించటంతో జైహింద్ నినాదాలతో స్టేడియం మర్మోగింది.

Tags:    

Similar News