బెంజ్ కారుని సబ్ మెరైన్ చేద్దామనుకున్నారా?... బీచ్ లో వీడియో వైరల్!

కార్లు, బైకులతో సముద్రపు ఒడ్డున కాస్త తడిచిన ఇసుకలో రయ్ రయ్ మం టూ సాగడం చాలా మందికి చాలా ఇష్టం.;

Update: 2025-07-22 07:29 GMT

కార్లు, బైకులతో సముద్రపు ఒడ్డున కాస్త తడిచిన ఇసుకలో రయ్ రయ్ మం టూ సాగడం చాలా మందికి చాలా ఇష్టం. వాహనం ముందుకు కదులుతుంటే.. వెనుక టైర్ల నుంచి ఇసుక వేగంగా వెనక్కి ఎగురుతుంటే.. కొంతమంది ఆ రైడ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. కాకపోతే ఆ సమయంలో అంతా సవ్యంగా జరగాలి.. కాకపోతే మొదటికే మోసం కన్ ఫాం..!

ఈ విషయంలో చాలా మందికి అనుభవాలు ఉండే ఉంటాయి. ఇసుకలో బైక్ స్కిడ్ అయితే పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు.. అదే ఇసుకలో కారు దిగబడిపోతే మాత్రం వ్యవహారం మామూలుగా విసిగించదు. మరో వాహనం పెట్టి లాగించాల్సి ఉంటుంది. అదే సముద్రంలోని కెరటాలు తాకే చోట మూడు, నాలుగు అడుగుల లోతులో ఇసుకలో కారు కూరుకుపోతే! తాజాగా అదే జరిగింది.

అవును... గుజరాత్‌ లోని సూరత్‌ లోని డుమాస్ బీచ్‌ లో ఓ మెర్సిడెజ్ బెంజ్ ఎస్యూవీ కారు ఇరుక్కుపోయింది. ఇద్దరు యువకులు చేసిన స్టంట్ తప్పుగా జరగడంతోనే అది ఇసుకలో చిక్కుకుందని అంటున్నారు. దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌ గా మారింది. ఈ సమయంలో.. అసలు డుమాస్ బీచ్ లో డ్రైవింగ్ చేయడానికి వీరికి అనుమతి ఎవరు ఇచ్చారనే విషయం తెరపైకి వచ్చింది!

తాజాగా వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌ లో.. ఇరుక్కుపోయిన కారు, దాని చుట్టూ దయణీయంగా చూస్తున్న ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు! ఇసుక నుండి వాహనాన్ని ఎలా బయటకు తీయాలో తెలియక వారు ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో... ఆ వ్యక్తులు చేసేదేమీ లేక, నిస్సహాయంగా నిలబడి ఉన్నట్లు చూడవచ్చు.

మరోవైపు... భద్రత, పర్యావరణ సమస్యల దృష్ట్యా డుమాస్ ప్రాంతంలో డ్రైవింగ్ చేయడం ఖచ్చితంగా నిషేధించబడిందని అంటున్నారు. ఈ ప్రాంతంలో పోలీసు పెట్రోలింగ్ ఉన్నప్పటికీ, ఆ వ్యక్తులు ఎస్యూవీతో ఆ ప్రాంతంలోకి ఎలా ప్రవేశించగలిగారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కొంతమంది సెటైర్స్ వేస్తుంటే, మరికొంతమంది ఫైర్ అవుతున్నారు.

ఇక ఈ వీడియోని పోస్ట్ చేసిన వ్యక్తి... సూరత్‌ లోని డుమాస్ బీచ్‌ లో ఒక మెర్సిడెస్ కారు, జలాంతర్గామితో పోటీ పడాలని నిర్ణయించుకుందని ఎద్దేవా చేశారు. దీన్ని.. ధనవంతులైన ఆకతాయిలు వివరించడానికి ప్రయత్నించారని రాసుకొచ్చారు. అయితే... కారు దాని స్వంత వైఖరిని కలిగి ఉందని తెలిపారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

Tags:    

Similar News