ఆ కుటుంబాల‌కు 5 ల‌క్ష‌లు: గంట‌కోసారి చంద్ర‌బాబు ఫోన్‌!

ఏపీలోని ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో ఉన్న మార్కాపురంలో గురువారం జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో 13 మంది స‌జీవ‌ద‌హ‌నంఅయ్యారు.;

Update: 2026-03-26 16:53 GMT

ఏపీలోని ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో ఉన్న మార్కాపురంలో గురువారం జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో 13 మంది స‌జీవ‌ద‌హ‌నంఅయ్యారు. వీరిలో 9 మందిని అధికారులు గుర్తించారు. మిగిలిన న‌లుగురి గుర్తింపు కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక‌, ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 22 మంది ఆసుప‌త్రుల్లోచికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని ప్రాణాధార వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నామ‌ని వైద్యులు చెప్పారు.

ఇదిలావుంటే.. ఈ ఘ‌ట‌నపై నిరంత‌రం సీఎం చంద్ర‌బాబు సమీక్షిస్తున్నారు. జిల్లా అధికారులు, అదేవి ధంగా సంబంధిత మంత్రుల‌కు చంద్ర‌బాబు గంట‌కోసారి ఫోన్ చేసి.. ప‌రిస్థితిని తెలుసుకుంటున్నారు. బాధితుల‌కు మెరుగైన వైద్య అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్ప‌టికే.. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన మంత్రుల‌తో పాటు.. ప‌లువురు సీనియ‌ర్ అధికారుల‌ను కూడా రంగంలోకి దింపారు. ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగు ప‌రిచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఇక‌, ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌లు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. కేంద్రం త‌ర‌ఫున.. మృతి చెందిన వారి కుటుంబాల‌కు ప్ర‌ధాన మంత్రి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున సాయం ప్ర‌క‌టించారు. గాయాలతో ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న వారికి 50 వేల రూపాయ‌ల చొప్పున ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు.

ఇక‌, ప్ర‌భుత్వం కూడా ప‌రిహారం ప్ర‌క‌టించింది. మృతి చెందిన వారి కుటుంబాల‌ను గుర్తించి.. వారికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున సాయం అందించాల‌ని.. క‌లెక్ట‌ర్‌ను ఆదేశించింది. గాయ‌పడిన వారికి 2 ల‌క్ష‌ల చొప్పున సాయం అందించ‌నున్నారు. కాగా.. తెలంగాణ‌లోని జ‌గిత్యాల నుంచి మార్కాపురానికి వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు అగ్నికి ఆహుతైంది. దీనిపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. స్టీరింగ్ స్ట్ర‌క్ అయింద‌ని.. డ్రైవ‌ర్ చెప్పిన‌ట్టు పోలీసులు తెలిపారు. మొత్తంగా ఈ కేసును అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News