మమతను వెంటాడుతున్న సువేందు.. మళ్లీ షాక్ తప్పదా?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోల్‌కతాలోని భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల కేంద్రబిందువుగా మారింది.;

Update: 2026-05-04 04:46 GMT

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోల్‌కతాలోని భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల కేంద్రబిందువుగా మారింది. టీఎంసీ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈసారి ఆధిక్యం స్థిరంగా లేకపోవడం చర్చనీయాంశమైంది. ప్రతి రౌండ్‌ కౌంటింగ్‌లో లీడ్ మారుతూ ఉండటంతో టీఎంసీ శిబిరంలో ఉత్కంఠ పెరుగుతుండగా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా బీజేపీ నేత సువేందుకు అధికారి బలమైన పోటీ ఇవ్వడమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా, కీలక సహచరుడిగా ఎదిగిన సువేందు అధికారి, తర్వాత రాజకీయ మార్పులతో బీజేపీలో చేరి ఆమెకు ప్రధాన ప్రత్యర్థిగా మారారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతాను నేరుగా ఎదుర్కొని విజయం సాధించడం ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపుగా నిలిచింది.

నందిగ్రామ్‌లో ఎదురైన ఆ షాక్‌తో మమతా బెనర్జీకి సీఎం పదవి కొనసాగించాలంటే భవానీపుర్ ఉపఎన్నికల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో టీఎంసీ శక్తివంచన లేకుండా పోరాడి ఆమెను విజయం దిశగా తీసుకెళ్లింది. అయితే ప్రస్తుతం భవానీపుర్‌లో పరిస్థితులు అంత సులభంగా లేవనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న పోటీలో సువేందు అధికారి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. భవానీపుర్‌లో టీఎంసీకి ఉన్న సంప్రదాయ బలాన్ని సవాలు చేస్తూ ఆయన ప్రచారం కొనసాగించారు. స్థానిక సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక భావాలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మరోవైపు టీఎంసీ కూడా తన బలగాలను రంగంలోకి దించి, మమతా బెనర్జీకి మద్దతు నిలబెట్టుకునేందుకు కృషి చేస్తోంది.

ప్రతి రౌండ్ ఫలితాలు మారుతూ ఉండటం వల్ల రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఒకవైపు “దీదీ కంచుకోట”గా భావించే భవానీపుర్‌లో టీఎంసీ ఆధిపత్యం పడిపోతోంది. కౌంటింగ్ లో సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్నారు. తుది ఫలితాల్లో ఆయనే గెలిచేలా కనిపిస్తున్నారు. లేక నందిగ్రామ్ తరహాలో మరో సంచలనం నమోదు అవుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బీజేపీ శ్రేణులు మాత్రం సువేందు అధికారి మళ్లీ 2021 సన్నివేశాన్ని రిపీట్ చేస్తారని ధీమాగా చెబుతున్నాయి. టీఎంసీ వర్గాలు మాత్రం చివరికి మమతా బెనర్జీ విజయం ఖాయం అంటూ నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి భవానీపుర్ ఫలితం బెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకురానుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News