వెంకన్న సన్నిధిలో మల్లారెడ్డి వ్యాఖ్యల మర్మమేమిటో?
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సినీ సెలెబ్రెటీలు, రాజకీయ నాయకులు ఏపీ అభివృద్ధి, అక్కడి సీఎం పని తీరుపై వ్యాఖ్యలు చేస్తుంటారు;
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సినీ సెలెబ్రెటీలు, రాజకీయ నాయకులు ఏపీ అభివృద్ధి, అక్కడి సీఎం పని తీరుపై వ్యాఖ్యలు చేస్తుంటారు. మంగళవారం వెంకన్నను దర్శించుకున్న తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ సర్కిళ్లలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఏపీలో అభివృద్ధి శరవేగంగా సాగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఈ మార్పుకు కారణమని ఆయన ప్రకటించడం గమనార్హం.
ఏపీ అభివృద్ధిపై ప్రశంసలు
ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు లక్షల కోట్లు కేటాయిస్తుండగా, వాటిని సమర్థంగా వినియోగిస్తూ చంద్రబాబు అభివృద్ధి యంత్రాన్ని పరుగులు తీయిస్తున్నారని మల్లారెడ్డి ప్రశంసించారు. ఈ అభివృద్ధి కేవలం ప్రభుత్వ ప్రాజెక్టులకే పరిమితం కాకుండా, పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల స్థాయిలో కూడా కనపడుతోందని పేర్కొన్నారు.
తెలంగాణతో పోలికలు
ఇక తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితిని ఆయన పోల్చారు. కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లలో దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి జరిగినప్పటికీ, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందన్నారు .ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేవారని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని, తెలంగాణ ప్రజలే ఏపీలో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇది రెండు రాష్ట్రాల ఆర్థిక దిశల మధ్య మార్పు స్పష్టమవుతున్నదని వ్యాఖ్యానించారు.
రాజకీయ వ్యూహమా.. వ్యక్తిగతమా?
మల్లారెడ్డి వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలుగానే కనిపించినా, అందులో రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ఏపీ ప్రభుత్వాన్ని అభినందించడం ద్వారా కేంద్రం–చంద్రబాబు అనుసంధానాన్ని పరోక్షంగా గుర్తించగా, మరోవైపు తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులపై విమర్శలు చేయడం ద్వారా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే పాతరోజులు వస్తాయని సంకేతమిచ్చినట్లు తెలుస్తోంది.
అటు పొగడ్తలు. ఇటు చురకలు
ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఒకవైపు ఏపీ అభివృద్ధిని పొగడ్తలతో ముంచెత్తడం, మరోవైపు తెలంగాణ పరిస్థితులను వివరిస్తూ చురకలంటించారు. రెండు రాష్ట్రాల రాజకీయ, ఆర్థిక పరిస్థితులను పోల్చి చూపించే ప్రయత్నం చేశారు. తిరుమలేశుని సన్నిధిలో చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత కోణంలో కాకుండా, రాజకీయంగానూ చర్చకు దారి తీస్తున్నాయి.