వీసా-ఫ్రీ అంటే వర్క్ పర్మిట్ కాదు.. భారతీయులకు హైకమిషన్ కీలక హెచ్చరిక

మలేషియా ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు అందుబాటులోకి వచ్చిన వీసా-ఫ్రీ ఎంట్రీ సదుపాయం కొందరు భారతీయులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది.

Update: 2026-09-22 13:30 GMT

మలేషియా ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు అందుబాటులోకి వచ్చిన వీసా-ఫ్రీ ఎంట్రీ సదుపాయం కొందరు భారతీయులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. వీసా అవసరం లేదనే నెపంతో మలేషియాకు వెళ్లి అక్కడ ఉద్యోగాలు వెతుక్కోవడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఈ నేపథ్యంలో కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ మలేషియా వెళ్లాలనుకునే భారతీయ పౌరులకు అత్యంత కీలకమైన హెచ్చరికను జారీ చేసింది.

పర్యాటకానికి మాత్రమే అనుమతి

భారతీయ పాస్‌పోర్ట్ దారులకు మలేషియా ప్రభుత్వం 30 రోజుల వరకు ఉచిత (వీసా-ఫ్రీ) ప్రవేశ సౌకర్యాన్ని కల్పించింది. అయితే ఈ సదుపాయం కేవలం పర్యాటకం , సామాజిక సందర్శనలు, కుటుంబ సభ్యులను కలవడం వంటి తాత్కాలిక అవసరాల కోసం మాత్రమేనని హైకమిషన్ స్పష్టం చేసింది. వీసా-ఫ్రీగా దేశంలోకి అడుగుపెట్టినంత మాత్రాన అక్కడ ఉద్యోగం చేసే హక్కు లభించినట్లు కాదని ఘంటాపథంగా పేర్కొంది.

ఏజెంట్ల మోసాలు.. చట్టపరమైన ప్రమాదాలు

మలేషియాలో ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు అక్రమ ఏజెంట్లు, మధ్యవర్తులు భారతీయులను నమ్మిస్తున్నట్లు హైకమిషన్ గుర్తించింది. వీరి మాటలు నమ్మి టూరిస్ట్ వీసాపై వెళ్తున్న అనేకమంది అక్కడ చిక్కుల్లో పడుతున్నారు. మలేషియా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం సరైన వర్క్ పర్మిట్ లేదా చట్టబద్ధమైన ఎంప్లాయ్‌మెంట్ వీసా లేకుండా ఏ విధమైన పని చేయడం కూడా తీవ్రమైన నేరం.

ఇలా వెళ్లి వీసా గడువు తీరిపోయిన తర్వాత కూడా అక్కడ ఉండిపోతే వారిని అక్రమ వలసదారులుగా పరిగణిస్తారు. దీనివల్ల అరెస్టులు, భారీ జరిమానాలు, నిర్బంధ కేంద్రాల్లో జైలు శిక్ష అనుభవించడమే కాకుండా.. శాశ్వతంగా ఆ దేశం నుంచి బహిష్కరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతేకాకుండా ఇటువంటి వారు ఏజెంట్ల చేతిలో శ్రమ దోపిడీకి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.

పర్యాటకులు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు

నిజమైన ఉద్దేశంతో పర్యాటకం కోసం మలేషియా వెళ్లే భారతీయ ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో ఇబ్బందులు పడకుండా ఈ క్రింది పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉండాలి. తిరుగు ప్రయాణానికి సంబంధించిన కన్ఫర్మ్‌డ్ విమాన టికెట్ ఉంచుకోవాలి..

మలేషియాలో ఉండే కాలానికి సంబంధించిన వసతి వివరాలు చూసుకోవాలి. ప్రయాణానికి కనీసం 3 రోజుల ముందు 'మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్' (ఎండీఏసీ) నమోదు చేసుకున్న ఆధారాలుండాలి. ప్రయాణ ఖర్చులకు సరిపడా నిధులు ఉంచుకోవాలి.

ఉద్యోగార్థులు ఏం చేయాలి?

విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారు సోషల్ మీడియా ప్రకటనలను, పేరు తెలియని ఏజెంట్లను గుడ్డిగా నమ్మవద్దు. మలేషియాలో ఉద్యోగం చేయాలంటే ముందుగానే అధికారికంగా ఉద్యోగ ఆఫర్ పొంది, సంబంధిత కంపెనీ ద్వారా వర్క్ పర్మిట్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రయాణం కావడం సురక్షితం. వీసా-ఫ్రీ ప్రవేశాన్ని దుర్వినియోగం చేసి జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని భారత హైకమిషన్ భారత పౌరులకు విజ్ఞప్తి చేసింది.

Tags:    

Similar News