చీరకట్టుతో మారథాన్ గెలిచింది.. ఎవరీ ముధస్మితా జెనా

మనసు ఉంటే మార్గం ఉందని చెబుతారు. ఆటలకు ఫలానా డ్రెస్ మాత్రమే సూట్ అవుతుందని చాలామంది చెబుతారు.;

Update: 2026-05-04 04:34 GMT

మనసు ఉంటే మార్గం ఉందని చెబుతారు. ఆటలకు ఫలానా డ్రెస్ మాత్రమే సూట్ అవుతుందని చాలామంది చెబుతారు. కానీ.. అలాంటివేమీ లేకుండా.. సంప్రదాయ వస్త్రధారణతో బరిలోకి దిగి విజయం సాధించటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. కొందరు పట్టుబట్టి మరీ తమ చేతల్లో చేసి చూపిస్తుంటారు. ఆ కోవలోకే వస్తారు మధుస్మితా జెనా. మిగిలిన ఆటలకు భిన్నంగా మారథాన్ అన్నంతనే ట్రౌజర్లు.. టీ షర్ట్స్.. టాంక్ టాప్స్.. షార్ట్స్ ఇలాంటి వస్త్రధారణతో బరిలోకి దిగే మిగిలిన వారికి భిన్నంగా మాంచెస్టర్ మారథాన్ లో చీరకట్టుతో ట్రాక్ మీదకు రావటమే కాదు.. అప్పటివరకు ఉన్న రికార్డుల్ని బద్ధలు కొట్టి.. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో తన పేరును నమోదయ్యేలా చేశారు. ఇంతకూ ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. బోలెడన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

ఒడిశా పూర్వ రాజధాని కటక్ (ఇప్పుడు భువనేశ్వర్) లోని కసుపూర్ కు చెందిన మధుస్మిత తల్లిదండ్రులు ఆమె చిన్నప్పుడు జాబ్ లో భాగంగా యూకేకు వెళ్లిపోయారు. మాంచెస్టర్ లో స్థిరపడ్డారు. దేశం కాని దేశంలో ఉన్నా.. తమ బిడ్డకు తమ సంప్రదాయాల గురించి.. అలవాట్ల గురించి తరచూ చెప్పేవారు. తమ ఊరి పండుగలన్ని జరుపుకునేవారు. అలానే ఒడిశా కట్టూబొట్టూ కూడా ఆమె జీవితంలో భాగమైంది.

భారతదేశానికి వచ్చిన ప్రతిసారి ఆమె చీర కట్టుకునేవారు. ఆ అలవాటతో.. చీర మీద ఉన్న ఇష్టంతోనే చివరకు మాంచెస్టర్ మారథాన్ బరిలోకి దిగారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కటక్ లో టీచర్ గా పని చేస్తున్న ఆమె.. భువనేశ్వర్ కు చెందిన అబ్బాయినే పెళ్లాడారు. తొలిసారి తల్లి అయ్యాక తాను కుంగుబాటుకు గురవుతున్నట్లుగా గుర్తించారు. దాని నుంచి బయటకు వచ్చేందుకు పరుగును తన జీవితంలోకి భాగంగా చేసుకున్నారు.

రోజుకు ఐదు కిలోమీటర్లు తెలీకుండానే పరిగెత్తే ఆమెకు.. అంతలా పరుగు తీసిన తర్వాతే ప్రశాంతంగా ఫీలయ్యేవారు. అలా ఆమె జీవితంలోకి పరుగు మొదలైంది. పరుగు రోజువారీ జీవితంలో భాగమైన తర్వాత.. ఆమె అందులోని టెక్నిక్ ను అందిపుచ్చుకున్నారు. స్థానికంగా జరిగే పోటీల్లో ఆమె పాల్గొనేవారు. 2023 ఏప్రిల్ లో తాము నివాసం ఉండే ప్రాంతంలో జరిగిన పెద్ద మారథాన్ లో ఆమె తొలిసారి చీరకట్టుతో పాల్గొన్నారు.

వినూత్నంగా ఉంటుందని ఆమె భావించి వెళ్లగా.. అక్కడి వారు ఆమెను విచిత్రంగా చూడటమే కాదు.. పరుగు పందెంలో పాల్గొంటారా? చీరకట్టుతో మారథానా? అంటూ హేళనగా నవ్వారు. అలాంటి వారికి గెలుపుతో తన సమాధానాన్ని చెప్పేశారు. దీంతో జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆమె పేరు మారుమోగింది. ఆ సమయంలోనే చీరకట్టుతో పరుగు పందెంలోకి దిగి గెలిచిన మహిళల గురించి తెలుసుకున్నప్పుడు.. 2018లో బెర్లిన్ మారథాన్ లో క్రాంతి సాల్వి అనే మహిళ చీరట్టులో పాల్గొని 3.57 గంటల్లో రేస్ ను పూర్తి చేశారని గుర్తించారు. మరింత ప్రాక్టీసు అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో మాంచెస్టర్ మారథాన్ లో ఒడిశా సంప్రదాయ ఇక్కత్ చీరతో పోటీల్లోకి దిగారు.

సౌకర్యం కోసం చీరను ట్రౌజర్ లా మడిచి కట్టుకున్న ఆమె.. అంతకు ముందు క్రాంతి కంటే 12 నిమిషాల ముందే రేసును పూర్తి చేసి.. గిన్నిస్ రికార్డును క్రియేట్ చేశారు. అంత కష్టపడి సాధించిన గెలుపు మొత్తాన్ని పిల్లలకు విద్యా వసతులు కల్పించేందుకు వీలుగా విరాళంగా ఇచ్చేశారు. అలా ఆమె విభిన్నమైన తీరు ఇప్పుడు అందరికి ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News