మూడు నెలల్లో స్థానిక ఎన్నికలు జరగవా? ప్రభుత్వం ప్రయత్నాలకు అడ్డంకులివే..

ఏపీలో మూడు నెలలు ముందుగానే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదని అంటున్నారు.;

Update: 2025-09-05 15:30 GMT

ఏపీలో మూడు నెలలు ముందుగానే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదని అంటున్నారు. మార్చిలో గడువు ముగియనున్న మున్సిపాలిటీలకు జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల కమిషన్ కు ఇప్పటికే లేఖ రాసింది. దానిపై స్పందించిన ఎన్నికల సంఘం జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషన్లకు కూడా దిశానిర్దేశం చేసింది. ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టాలని షెడ్యూల్ ప్రకటించింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీ, రిజర్వేషన్లు, ఎన్నికల అధికారుల నియామకం ఇలా ఎప్పుడు ఏం చేయాలో నిర్దేశించింది ఎన్నికల సంఘం. అయితే ప్రభుత్వం రాసిన లేఖలో కులగణన ప్రస్తావించడంతో షెడ్యూల్ లోపు ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.

ఎన్నికల హామీయే కానీ...

వాస్తవానికి స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కూటమి ఎన్నికల హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీ ప్రకారం ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అయితే రాష్ట్రంలో కులగణన చేపట్టకపోవడంతో బీసీ జనాభా లెక్కలు అందుబాటులో లేవు. దీంతో ప్రభుత్వం చెప్పినట్ల రిజర్వేషన్లు అమలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటే గడువులోగా కులగణన చేపట్టాల్సివుంది. అయితే మూడు నెలల తక్కువ కాలంలో కుల గణన సాధ్యమేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ కులగణన చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా కమిషన్ ను నియమించాల్సివుంటుంది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీ నోటిఫై చేయాల్సివుంటుందని అంటున్నారు. తెలంగాణలో కూడా బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు సిద్ధమవుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీ ప్రకారం...

సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అమలు చేయాలి అంటే ముందుగా కమిషన్ నియమించాల్సివుంటుందని చెబుతున్నారు. ఈ కమిషన్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీ కుల గణన చేసి బీసీలకు ఏయే నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ పంచాయతీలో ఏ మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న విషయమై నివేదిక రూపొందించాల్సివుంటుంది. ఇదే సమయంలో మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే నిబంధనను అనుసరించాల్సివుంటుందని అంటున్నారు. ఈ ప్రకారం గతంలోనే బీసీ కమిషన్ చైర్మనుగా జస్టిస్ శంకరనారాయణకు ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీ అమలు బాధ్యత అప్పగించారు. దీనికోసం ఆయన పదవీకాలాన్ని 2022 సెప్టెంబరు 20న మూడేళ్లు పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అప్పట్లో కొంతవరకు బీసీ కుల గణనపై ప్రయత్నాలు జరిగాయి. అయితే బీసీ కమిషన్ కు గత ప్రభుత్వంలో తగిన సమాచారం ఇవ్వకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు.

సాధ్యం కాదా?

అయితే ఇప్పుడు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇలా జరిగితే మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి చేరుకుంటాయి. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో విపక్షం ఎన్నికల నిర్వహణను అడ్డుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందంటున్నారు. గత ప్రభుత్వంలో బీసీలకు 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలు చేశారు. అప్పట్లో ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీని పాటించలేదు. దీనిపై ఎవరూ కోర్టుకు వెళ్లలేదు. దీంతో 24 శాతంతోనే ఎన్నికలు నిర్వహించారు. అయితే ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఏ లెక్కన అమలు చేసినా, ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీ కచ్చితంగా పాటించాలనే నిబంధన ఉంది. ప్రభుత్వం చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా కుల గణన చేపట్టాలి. దీనికి ఎంత లేదన్నా 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఈ దిశగా ముందుడుగు వేసిన డిసెంబరు వరకు కులగణన సాగుతుందని అంటున్నారు. ఆ తర్వాతే మిగిలిన ప్రక్రియ కొనసాగించాల్సివున్నందున స్థానిక ఎన్నికలు జనవరిలో జరిగే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు.

Tags:    

Similar News