‘పులి రాజు’ను అడ్డుకునే మందొచ్చె... ఇది రియల్ గేమ్ చేంజరే!
దాదాపు 65 ఏళ్లుగా ప్రపంచంలో మొండి రోగం హెచ్‌ఐవీ. దీనికి మందులేక ఎందరో ప్రాణాలు కోల్పోయారు.. ఎన్నో దేశాలు యువతరాన్ని కోల్పోయాయి.;
దాదాపు 65 ఏళ్లుగా ప్రపంచంలో మొండి రోగం హెచ్‌ఐవీ. దీనికి మందులేక ఎందరో ప్రాణాలు కోల్పోయారు.. ఎన్నో దేశాలు యువతరాన్ని కోల్పోయాయి. ఇంకా 20 ఏళ్లు కూడా నిండకుండానే ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎందరో. 20-30 ఏళ్ల కిందట మన దేశంలోనూ హెచ్‌ఐవీ వ్యాప్తి అత్యంత తీవ్రంగా ఉంది. దీంతో యువతరం ఏమైపోతుందో అనే భయం పట్టుకుంది. అందుకని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి గట్టి చర్యలు తీసుకున్నాయి. ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టాయి. అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ‘పులిరాజుకు ఎయిడ్స్’ వస్తుందా? అనేది బాగా పాపులర్ అయిన డైలాగ్.
ఇకఇంత మొండిరోగంతో ఇబ్బంది పడుతూ.. వ్యాధిని అదుపులో పెట్టే మందులు వాడుతున్నవారు ఇంకా ఎందరో...? మరి దీనికి నివారణ ఔషధమే లేదా?
ఎన్నో పరిశోధనలు.. మరెన్నో పరిశీలనలు.. హెచ్‌ఐవీ (హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్) అంతుచూడలేకపోయాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసే ఈ వైరస్ ను మట్టుబెట్టలేకపోయాయి. ఇక హెచ్‌ఐవీ ముదిరితే ఎయిడ్‌్స (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్)గా మారుతుంది. దీనికి చికిత్స లేదు. అయితే, సరైన వైద్య సంరక్షణ, చికిత్సతో పురోగతిని నెమ్మదించేలా చేయొచ్చు. లేదా ఆపొచ్చు. హెచ్‌ఐవీ పాజిటివ్ వ‍్యక్తులు అన్ని జాగ్రత్తలతో సుదీర‍్ఘ కాలం జీవించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఐదున్నరేళ్ల కిందట పుట్టిన కొవిడ్ వైరస్‌కు ఏడాదిలోనే టీకాను తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు. అసలు సాధ్యం కాదు అనుకున్న దీనిని చేసి చూపారు. కొన్ని విమర్శలున్నా.. కొవిడ్ టీకాలు విజయవంతం అయ్యాయనే చెప్పాలి. మరి హెచ్‌ఐవీకి మందు లేదా.? ఎందుకు లేదు అంటున్నారు. తాజాగా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) హెచ్‌ఐవీని నిరోధించే ఔషధానికి మందు తెచ్చింది. దీనిపేరు లెనకాపివర్.
యెజ్టుగో పేరిట దీనిని మార్కెటింగ్ చేయనుంది ఫార్మా దిగ్గజం గిలీడ్ సైన్సెస్. ఏడాదికి రెండుసార్లు ఈ ఇంజెక‌్షన్ వేసుకుంటే హెచ్‌ఐవీని నిరోధించవచ్చని చెబుతున్నారు. క్లినికల్ ట్రయల్స్ అనంతరం ఎఫ్‌డీఏ దీనిని అనుమతిచ్చింది.ట్రయల్స్‌లో 99.9 శాతం మంది హెచ్‌ఐవీ నెగెటివ్ రావడం గమనార్హం. హెచ్‌ఐవీ నియంత్రణ ప్రయత్నాల్లో దీనిని ఒక ముఖ్యమైన ముందడుగుగా చెబుతున్నారు. అంతేకాదు... ఈ ఔషధాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్వాగతించడం విశేషం.