ఆ నలుగురు: చంద్రబాబుకు రైటు.. లెఫ్ట్ హ్యాండ్స్.. !
ఇలాంటి సమయాల్లో నలుగురు వ్యక్తులు పార్టీలని, ప్రభుత్వాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. వారివల్ల ఒకరకంగా.. సీఎం చంద్రబాబు.. సేఫ్ అవుతున్నారన్న వాదన వినిపిస్తోంది.;
ఏపీ సీఎం చంద్రబాబుకు.. ఇటు పార్టీ పరంగా.. అటు ప్రభుత్వ పరంగా నలుగురు నాయకులు చేదోడు వాదోడుగా వ్యవహరిస్తున్నారా? ఒకరకంగా ఆయనకు ఇబ్బందులు రాకుండా కాపు కాస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. సాధారణంగా కూటమి ప్రభుత్వాలు ఏర్పడిన రాష్ట్రాల్లో వివాదాలు కామన్‌గా మారాయి. మహారాష్ట్రలో శివసేన+బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆరు మాసాల్లోనే వివాదాలు రచ్చకెక్కాయి.
అదేవిధంగా ఏపీలోనూ వివాదాలు వచ్చే అవకాశం ఎప్పుడూ ఏర్పడుతూనే ఉంది. అది టీడీపీ నేతల వల్ల కావొచ్చు.. జనసేన వర్గ పోరు వల్ల కావొచ్చు. ఇక, పార్టీ పరంగా నాయకులు చేస్తున్న `అతి` కూడా ఎప్పటిక ప్పుడు టీడీపీలో వివాదాలు తెరమీదికి వచ్చేలా చేస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో నలుగురు వ్యక్తులు పార్టీలని, ప్రభుత్వాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. వారివల్ల ఒకరకంగా.. సీఎం చంద్రబాబు.. సేఫ్ అవుతున్నారన్న వాదన వినిపిస్తోంది.
1) పవన్ కల్యాణ్: డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్.. జనసేనలో వస్తున్న వివాదాలు, ప్రభుత్వం విషయంలో ఆ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా.. కూటమిని కాపాడుకునే ప్రయత్నంలో ముందున్నారనే చెప్పాలి. ముఖ్యంగా.. 15 ఏళ్ల మంత్రాన్ని ఆయనే తెచ్చారు... ఆయనే కాపాడుతున్నారు కూడా!.
2) నారా లోకేష్: టీడీపీలో తలెత్తుతున్న వివాదాలను తనదైన శైలిలో ఎప్పటికప్పుడు సరిదిద్దుతున్నారు. నాయకుల జోరుకు ముకుతాడు వేసే ప్రయత్నం చేయడం ద్వారా పార్టీలో తలెత్తుతున్న విషయాలను ఆయన సరిపుచ్చుతున్నారు. ఇది కూడా.. చంద్రబాబు ప్లస్‌గా మారుతోంది.
3) పయ్యావుల కేశవ్: ఆర్థికంగా ప్రభుత్వానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెన్నుదన్నుగా మారుతున్నారు. రాష్ట్ర అవసరాలను... సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని నిధులకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. తద్వారా చంద్రబాబు ఎక్కడ ఎలాంటి హామీ ఇచ్చినా.. సేఫ్ గా వాటిని అమలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
4) పల్లా శ్రీనివాసరావు: రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు.. చంద్రబాబుకు అత్యంత వినయ విధేయుడిగా ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన పార్టీలో ఉన్న చిన్న చిన్న వివాదాలు పెరగకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ.. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పునాదులు పదిలంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా.. ఈ నలుగురు చంద్రబాబుకు రైటు-లెప్ట్ హ్యాండ్స్ మాదిరిగా వ్యవహరిస్తున్నారనడంలో సందేహం లేదు.