బాబు మీటింగ్ తరువాత అక్కడ రెబెల్ లీడర్ రెడీ...!

ఇపుడు చూస్తే వైసీపీ రెబెల్ గా 2019 ఎన్నికల్లో పోటీ చేసి 27 వేల ఓట్లకు పైగా తెచ్చుకున్న సియ్యారి దొన్ను దొరకు టికెట్ ఇస్తున్నారు. దాంతో అబ్రహం మండిపడుతున్నారు. అరకు లో ప్రతీసారి ఇలాగే జరుగుతోంది.

Update: 2024-01-21 03:45 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు అరకు మీటింగ్ పెట్టారు. రా కదలిరా అంటూ గిరిజనులను ఉత్తేజపరిచారు. జనాలు బాగా పెద్ద ఎత్తున వచ్చారని సంబరపడ్డారు. ఈసారి అరకులో విజయం తధ్యమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అంతా బాగుంది అనుకునేంతలో అరకు టీడీపీలో అసమ్మతి జ్వాల ఎగిసిపడింది. అరకులో రెబెల్ లీడర్ రెడీ అంటూ ముందుకు వచ్చాడు.

ఆయన ఎవరో కాదు 2009లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సివేరి సోమ కుమారుడు సివేరి అబ్రహం. తాను అరకు నుంచి వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అని చెప్పి టీడీపీ అధినాయకత్వానికి గట్టి షాక్ ఇచ్చారు. తనకు చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. తనకు 2024లో టికెట్ ఇస్తామని చెప్పి ఇపుడు వేరే వారికి టికెట్ ఇచ్చారని అబ్రహం ఫైర్ అయ్యారు.

ఈ మేరకు ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ చంద్రబాబు మీద ఘాటు విమర్శలు చేశారు. తాను గత అయిదేళ్ళుగా నియోజకవర్గాన్ని అట్టిపెట్టుకొని జెండాను మోశానని అబ్రహం అంటున్నారు. అలాంటి తనను పక్కన పెట్టి వేరు ఎవరికో టికెట్ ఇవ్వడమేంటి అని ఆయన బాబుని నిలదీశారు.

అంతే కాదు అరకు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తనకు బలమైన క్యాడర్ ఉందని అందువల్ల తాను అక్కడ గెలిచి మరీ చంద్రబాబు వద్దకు వెళ్తాను అని భీషణ ప్రతిన చేశారు. ఇదిలా ఉంటే 2014లో టీడీపీ తరఫున సివేరి సోమ పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి కిడారి సర్వేశ్వరరావు చేతిలో ఓటమి పాలు అయ్యారు.

Read more!

ఆ తరువాత సర్వేశ్వరరావు టీడీపీలోకి వచ్చారు. ఆయనను సివేరి సోమను కలిపి మావోయిస్టులు 2018లో దారుణంగా హత్య చేశారు. కిడారు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి సానుభూతి కోసం చంద్రబాబు ఆయన కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్ ని ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేశారు. అంతే కాదు 2019లో ఆయనకే టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో అబ్రహం కి 2024లో ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇపుడు చూస్తే వైసీపీ రెబెల్ గా 2019 ఎన్నికల్లో పోటీ చేసి 27 వేల ఓట్లకు పైగా తెచ్చుకున్న సియ్యారి దొన్ను దొరకు టికెట్ ఇస్తున్నారు. దాంతో అబ్రహం మండిపడుతున్నారు. అరకు లో ప్రతీసారి ఇలాగే జరుగుతోంది. ప్రధాన అభ్యర్ధుల మీద రెబెల్స్ పోటీకి దిగుతూ ఉంటారు. బలమున్న పార్టీలు గెలుస్తాయి. లేకపోతే రెబెల్స్ ప్రభావంతో ఓటమి పాలు అవుతాయి. సివేరి అబ్రహం కి బలం ఉంది ఆయన కనీసంగా పాతిక వేల దాక ఓట్లు చీల్చగలడు అని అంటున్నారు. మరి ఆయనను టీడీపీ నాయకత్వం ఎలా బుజ్జగిస్తుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News