రేవంత్‌ రెడ్డిపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు!

ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్‌ పెద్దల అనుమతి తీసుకోవాల్సిందేనని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు.;

Update: 2024-02-02 09:16 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పై ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పరిణతి, అనుభవంలేని రేవంత్‌ పాలనలో తెలంగాణ ప్రజలకు కష్టాలు తప్పవని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు స్వతంత్రంగా వ్యవహరించలేరని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్‌ పెద్దల అనుమతి తీసుకోవాల్సిందేనని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు.

ఈ మేరకు సూర్యాపేట జిల్లా నడిగూడెంలో రాజావారికోటలో ఓ కార్యక్రమానికి హాజరైన లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు.

ప్రజాసమస్యల పరిష్కారమంటే ఎన్నికల్లో హామీలు ఇచ్చినంత సులువు కాదని వ్యాఖ్యానించారు.

మాజీ సీఎం కేసీఆర్‌ తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారని లక్ష్మీపార్వతి కొనియాడారు. ప్రతి రంగంలో కేసీఆర్‌ అభివృద్ధిని చేసి చూపించారని ప్రశంసలు కురిపించారు. రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. భూగర్భ జలవనరులు పెరిగేందుకు మిషన్‌ కాకతీయ పేరుతో చెరువుల పూడికతీత చేపట్టారని చెప్పారు. మిషన్‌ భగీరథతో ప్రతి ఇంటికి నల్లా ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించారని గుర్తు చేశారు.

రేవంత్‌ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు కావడం, గతంలో టీడీపీలో ఉండటం వంటి కారణాలతోనే లక్ష్మీపార్వతి.. రేవంత్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందులోనూ వైసీపీ స్టాండ్‌ కూడా ఇదేనని అంటున్నారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వైసీపీ నుంచి ఒక్కరు కూడా కనీసం ఆయనకు అభినందనలు కూడా తెలపలేదని గుర్తు చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టే లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.

లక్ష్మీపార్వతి వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అందులోనూ లక్ష్మీపార్వతి తెలంగాణకు వచ్చి రేవంత్‌ రెడ్డిపైన విమర్శలు చేయడంతో కాంగ్రెస్‌ నేతల అందుకు తగ్గట్టే ఘాటు కౌంటర్లు ఉండొచ్చంటున్నారు.


Tags:    

Similar News