ప్రేమించినోడు హెచ్ ఐవీ ఇంజెక్టు చేస్తే.. సమాజం సూటిపోటి మాటలతో చంపేసింది
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే..;
ఆమె చేసిన తప్పేంటి? ఈ విషాద ఉదంతం గురించి తెలిసినప్పుడు ఎదురయ్యే ప్రాథమిక ప్రశ్న. నచ్చినోడ్ని.. ఇంట్లోవాళ్లు ఒప్పుకున్నోడ్ని ప్రేమించటమే ఆమె చేసిన అతి పెద్ద తప్పుగా చెప్పాలి. అయితే.. ప్రేమించినోడు సైకో తరహాలో వ్యవహరిస్తే... అయ్యో అని అక్కున చేర్చుకోవాల్సిన సమాజం.. అందుకు భిన్నంగా చులకనగా చూడటం.. సూటిపోటీ మాటలతో ఆడిపోసుకోవటంతో.. భరించలేని ఆ చిన్న మనసు తన ప్రాణాల్ని తానే తీసుకుంది. ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందన్న కోపంతో.. కసిగా తనకున్న హెచ్ ఐవీ వైరస్ ను ఎక్కించాలన్న దుర్మార్గంతో ఇంజెక్షన్ చేసిన దుర్మార్గం గుర్తుండే ఉంటుంది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లాకు చెందిన 26 ఏళ్ల మనోహర్ కుటుంబం పాతికేళ్ల క్రితం సిటీకి వచ్చి ఘట్ కేసర్ మండలం అన్నోజిగూడ లో ఉంటోంది.యువకుడు ట్రాన్స్ పోర్ట్ సూపర్ వైజర్. తల్లిదండ్రులకు హెచ్ఐవీ ఉండటం.. తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించారు. తమ ఇంటికి దగ్గర్లో ఉండే తన మరదలు రమణి (24) ఇష్టపడటం.. పెద్దల సమ్మతితో ప్రేమగా మెలిగారు. పెళ్లికి సిద్ధమయ్యే వేళలో.. మనోహర్ కు యువతి తండ్రి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మనోహర్ కు హెచ్ ఐవీ పాజిటివ్ గా తేలింది. దీంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు.
దీంతో.. తాను ప్రేమించిన అమ్మాయి దూరమవుతుందన్న ఉద్దేశంతో.. తన హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఇంజెక్షన్ రూపంలో ఆమెకు ఎక్కిస్తే.. తనకు పాజిటివ్ అవుతుందని.. అప్పుడు పెళ్లి అవుతుందంటూ అత్యంత క్రూరంగా ఆలోచించాడు. అందుకు తగ్గట్లే మార్చి 11న సిరంజీ కొని తన రక్తాన్ని ఎక్కించి.. యువతి ఇంటికి వెళ్లిఆమెకు బలవంతంగా తన రక్తాన్ని ఎక్కించి పారిపోయాడు. బాధితురాలు ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచింది. కానీ.. ఆమెకు అనారోగ్యం పాలు కావటంతో వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆమె అసలు విషయాన్ని చెప్పాల్సి వచ్చింది. బాధితురాలి తండ్రి కంప్లైంట్ తో పోలీసులు అతడ్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం అతడు జైల్లో ఉన్నాడు.
తన జీవితంలో వచ్చిన మార్పును బాధితురాలు జీర్ణించుకోలేకపోయింది. ప్రేమించిన వ్యక్తే తన హెచ్ ఐవీ రక్తాన్ని ఎక్కించిన విషయం బయటకు రాగానే.. ఫ్రెండ్స్ దూరమయ్యారు. బంధువులు మాట్లాడటం మానేశారు. బయటకు వెళితే సూటిపోటీ మాటల్ని భరించలేకపోయింది. బయటకు వెళితే వింతగా చూడటం.. ఆమె గురించి మాట్లాడుకోవటాన్ని తట్టుకోలేకపోయింది. ఈ మనోవేదనతో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. మనోహర్ తో పెళ్లి వద్దని నాన్న చెప్పాడని.. తన జీవితం ఆగమవుతుందన్నారని.. తనకు హెచ్ ఐవీ అంత ప్రమాదమని తెలీదంటూ సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. ‘ఇంట్లో వాళ్లు చెప్పాక హెచ్ ఐవీ ఎంత సీరియస్ అన్నది అర్థమైంది. అమ్మాక్షమించు. నువ్వు కష్టపడి చదివించినా.. నా జీవితం నాశనమైంది. మరోజన్మ ఉంటే నీ కడుపులోనే పుట్టాలని కోరుకుంటున్నా. నాన్న నన్ను క్షమించండి. గౌరవం.. విలువ పోయిన తర్వాత బతకటం బాగోలేదు’’ అంటూ తన ఆత్మహత్యకు కారణాల్ని తెలిపిన వైనం చూసినప్పుడు అయ్యో అనుకోకుండా ఉండలేని పరిస్థితి.