కర్నూలు ప్రమాదం: తప్పించుకున్న 19 వాహనాలు! చివరికి ఈ ఘోరం
కర్నూలు జిల్లా మరోసారి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఏకంగా 19 మంది ప్రాణాలను బలితీసుకుంది.;
కర్నూలు జిల్లా మరోసారి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఏకంగా 19 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ దారుణ సంఘటన వెనుక జరిగిన సంఘటనల వరుస ఇప్పుడు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు కంటే కేవలం పది నిమిషాల ముందు, దాదాపు 19 వాహనాలు రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను సురక్షితంగా తప్పించుకుని వెళ్లాయనే విషయం విస్తుగొలుపుతోంది.
ప్రమాదం జరిగిందిలా..
సమాచారం ప్రకారం.., ఈ దుర్ఘటన తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో ప్రారంభమైంది. శివశంకర్ అనే బైక్ రైడర్ అతివేగం కారణంగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని బైక్ రోడ్డుమధ్యలో పడిపోయింది.
అతను చనిపోయిన పది నిమిషాల తర్వాత, అంటే 2.55 గంటల ప్రాంతంలో కావేరీ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు అదే రూట్‌లో వేగంగా వస్తూ రోడ్డుపై పడి ఉన్న బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, అదుపు తప్పిపోయి, అతి దారుణంగా ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
* 19 వాహనాలు తప్పించుకున్నాయ్!
ఈ సంఘటనలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బైకర్ ప్రమాదానికి గురైన సమయానికి, బస్సు ఢీకొట్టిన సమయానికి మధ్య దాదాపు 19 వాహనాలు ఆ బైకును గమనించి, చాకచక్యంగా తప్పించుకుని సురక్షితంగా వెళ్లిపోయాయి. ఇంత మంది డ్రైవర్లు తప్పించుకున్న బైకును, బస్సు డ్రైవర్ మాత్రం ఎందుకు గమనించలేకపోయాడు? నిర్లక్ష్యంతో డ్రైవ్ చేశాడా? అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
* దర్యాప్తు కొనసాగుతోంది:
ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరిస్తున్నారు. బైకర్ మరణించిన సమయం, బస్సు వెళ్లిన సమయం, ఇతర వాహనాల రాకపోకలు వంటి కీలక వివరాలన్నీ పరిశీలనలో ఉన్నాయి.
"ఒకవేళ ఆ సమయంలో ఎవరో ఒకరు మానవత్వంతో స్పందించి, ప్రమాదానికి గురైన బైకును రోడ్డు పక్కకు జరిపి ఉంటే, ఈ ఘోర ప్రమాదం, 19 మంది నిరపరాధుల ప్రాణ నష్టం తప్పించేది" అని స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ప్రస్తుతం ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటన రోడ్డు భద్రత, రాత్రివేళ డ్రైవింగ్ జాగ్రత్తలపై, అలాగే ప్రమాద సమయాల్లో స్పందించాల్సిన మానవత్వంపై మరోసారి ఆలోచింపజేస్తోంది. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.