కేటీఆర్ ట్వీట్.. వైసీపీ అధినేత జగన్ కు తీరని అవమానం?
అమరరాజా పరిశ్రమ యజమాని గల్లా జయదేవ్ తెలుగుదేశం నాయకుడు అన్న కారణంగా ఆ పరిశ్రమను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని ఆరోపిస్తున్నారు.;
ఏపీ మాజీ సీఎం జగన్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇరుకనపెట్టేశారన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో తాము అధికారంలో ఉండగా తీసుకువచ్చిన అమరరాజా బ్యాటరీ యూనిట్ ఫొటోలను షేర్ చేస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ ఆంధ్రా రాజకీయాల్లో పెను దుమారానికి తెరతీసింది. ఇప్పటికే ఓటమితో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేతను మరింత కార్నర్ చేసేలా కేటీఆర్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కేటీఆర్ ఆ ట్వీట్ చేయకపోయినా, జగన్ కు పరోక్షంగా నష్టం కలిగించేదిగానే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
మహబూబ్ నగర్ సమీపంలో అమరరాజా ఈవీ బ్యాటరీ యూనిట్ శరవేగంగా నిర్మితమవుతోంది. దీనిని కోట్ చేస్తూ తాము అధికారంలో ఉండగా, తీసుకువచ్చిన ఈ పరిశ్రమను చూస్తే ఆనందంగా ఉందని శనివారం కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అయితే ఇందులో ఎక్కడా ఆయన రాజకీయాలను ప్రస్తావించలేదు. కానీ, ఈ ట్వీట్ నేరుగా జగన్ ను షేక్ చేసేలా మారిందని విశ్లేషకులు అంటున్నారు. కేటీఆర్ ట్వీట్ ను వైరల్ చేస్తున్న జగన్ రాజకీయ ప్రత్యర్థులు.. ఆయన సర్కారు నిర్వాకం వల్లే అమరరాజా పరిశ్రమ తెలంగాణకు తరలిపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు.
అమరరాజా పరిశ్రమ యజమాని గల్లా జయదేవ్ తెలుగుదేశం నాయకుడు అన్న కారణంగా ఆ పరిశ్రమను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని ఆరోపిస్తున్నారు. ఏపీలో స్థాపించాల్సిన ఈ పరిశ్రమను కాలుష్యం పేరుతో గత ప్రభుత్వంలో అనుమతులు నిరాకరించారని గుర్తుచేస్తున్నారు. వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమను రాకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్ల అమరరాజా యాజమాన్యం ఏపీలో తమ పరిశ్రమను మూసేసి ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే ఈ చర్యను అప్పట్లో వైసీపీ నేతలు సమర్థించుకున్నారని గుర్తుచేస్తున్నారు. అదే సమయంలో పారిశ్రామిక పెట్టుబడులు ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో జయదేవ్ గల్లాతో చర్చించి మహబూబ్ నగర్ లో భూములు కేటాయించడంతో ఈ భారీ పరిశ్రమ కేవలం రెండేళ్ల వ్యవధిలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది.
శనివారం గద్వాల పర్యటనకు వెళ్లిన కేటీఆర్.. మార్గమధ్యలో అమరరాజా పరిశ్రమ పూర్తయిన విషయాన్ని గమనించి వాటి ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అంతేకాకుండా 2022లో అమరరాజా కంపెనీతో ఒప్పందం జరిగిన సందర్భంగా చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేశారు. దీంతో గతంలో జరిగిన ఎపిసోడ్ మొత్తాన్ని కూటమి కార్యకర్తలు గుర్తు చేస్తూ రాష్ట్రానికి జగన్ తీరని నష్టం చేశారని ధ్వజమెత్తుతున్నారు. రూ.9,500 కోట్ల విలువైన పరిశ్రమను రాష్ట్రానికి రాకుండా యువత పొట్టకొట్టారని ఆరోపిస్తున్నారు.