మిస్ వరల్డ్ వివాదం.. మిల్లా ఆరోపణలపై విచారణకు కేటీఆర్ డిమాండ్!
మిల్లా మాగీ చేసిన ఈ ఆరోపణలు తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.;
హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీలు ఓ సంచలన ఆరోపణతో అట్టుడికిపోతున్నాయి. మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ పోటీల నిర్వాహకులపై చేసిన తీవ్ర ఆరోపణలు, ఆమె మధ్యలోనే పోటీల నుంచి వెళ్లిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మిల్లాకు జరిగిన అవమానం తనను బాధించిందని ట్వీట్ చేశారు. ఈ ఆరోపణలపై తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో గత 74 ఏళ్లలో ఏ కంటెస్టెంట్ కూడా మధ్యలో నుంచి వెళ్లిపోని విధంగా, మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ పోటీల నుంచి తప్పుకున్నారు. ఆమె తిరిగి యూకే చేరుకున్న తర్వాత 'ది సన్' అనే బ్రిటిష్ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. 'బ్యూటీ విత్ ఎ పర్పస్' అనే నినాదం ఉన్నా ఈ పోటీలు కాలం చెల్లినవిగా నైతికంగా తాను భాగం కాలేనని మిల్లా మాగీ ఆరోపించినట్లు తెలుస్తోంది.
మిల్లా మాగీ చేసిన ఈ ఆరోపణలు తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తన వ్యక్తిగత ఆవేదనను తెలియజేస్తూ ట్వీట్ చేశారు. "మిల్లా మాగీ, నువ్వు చాలా ధైర్యవంతురాలివి. తెలంగాణలో నీకు ఇలాంటి అనుభవం ఎదురైనందుకు నేను నిజంగా చింతిస్తున్నాను" అని పేర్కొంటూ ఆమెకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు. ఇలాంటి అంతర్జాతీయ వేదికలపై ఎదుర్కొన్న అనుభవాలను చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలని ఆయన అన్నారు. మిల్లా చేసిన ఆరోపణలపై తక్షణమే పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు మహిళలను గౌరవించే వారికి సమాన అవకాశాలు కల్పించే గొప్ప సంస్కృతి ఉందని ఆయన గుర్తు చేశారు.
ఈ ఘటనతో తెలంగాణ పరువు అంతర్జాతీయంగా చెడిపోయిందని బీఆర్ఎస్ నాయకురాలు సబిత వంటి వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ మిస్ వరల్డ్ పోటీలు ఇప్పుడు తెలంగాణకు దేశానికి కూడా ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించాయని వారు ఆరోపించారు.
మరోవైపు, మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు మిల్లా మాగీ వ్యాఖ్యలను ఇప్పటికే ఖండించారు. మిల్లా తన తల్లి ఆరోగ్యం బాగోలేదనే కుటుంబ కారణాలతోనే పోటీ నుంచి తప్పుకోవాలని కోరారని, ఆమె అభ్యర్థనను అర్థం చేసుకుని, ఆమెను తిరిగి యూకే పంపే ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు. మిల్లా చేసిన ఆరోపణలు నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవి అని వారు పేర్కొన్నారు. మిల్లా ఇండియాలో ఉన్నప్పుడు తన కృతజ్ఞతను, ఆనందాన్ని వ్యక్తం చేసిన వీడియోలను కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని నిర్వాహకులు ప్రకటించారు.