'ఫార్ములా రేస్' పరిణామంతో కేటీఆర్ కు మరో తలనొప్పి

ఫోన్ ట్యాపింగ్.. కారు రేస్.. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖాయంగా కేటీఆర్ ను ఇరుకున పడేస్తుందని.. టైం బాగోకుంటే ఈ రెండు ఆయన రాజకీయ జీవితానికి కష్టాన్ని తీసుకొస్తాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో తరచూ జరుగుతూ ఉంటుంది;

Update: 2026-02-15 06:23 GMT

ఫోన్ ట్యాపింగ్.. కారు రేస్.. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖాయంగా కేటీఆర్ ను ఇరుకున పడేస్తుందని.. టైం బాగోకుంటే ఈ రెండు ఆయన రాజకీయ జీవితానికి కష్టాన్ని తీసుకొస్తాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో తరచూ జరుగుతూ ఉంటుంది. ఈ రెండు ఇష్యూస్ మీద గులాబీ పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తూ ఉంటుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర ప్రభుత్వంలో కీలక అధికారిగా వ్యవహరించిన అతి కొద్ది మంది అధికారుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఒకరు.

ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో నిధుల దుర్వినియోగం కేసుకు సంబంధించి ఆయన్ను ప్రాసిక్యూషన్ చేసేందుకు వీలుగా కేంద్రంఅనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే అటు అరవింద్ కుమార్ కు.. ఆ తర్వాత కేటీఆర్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయన్న మాట బలంగా వినిపిస్తోంది. 2023లో ఫార్ములా ఈ కారు రేసు నిర్వహణ సందర్భంగా అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలతో కేసు నమోదుకావటం తెలిసిందే.

ఈ కేసులో అరవింద్ కుమార్ పై చట్టపరమైన చర్యలకు అనుమతించాలని కోరుతూ గతంలో కేంద్ర సిబ్బంది.. శిక్షణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన కేంద్రం విచారణకు ఓకే చెబుతూ లేఖ పంపినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్కుమార్, మరికొందరు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో విదేశీ సంస్థలకు రూ.55 కోట్లు చెల్లించారన్న ఆరోపణలు అరవింద్ కుమార్ మీద ఉన్నాయి. క్యాబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా అలా ఎలా చేస్తారన్నది ప్రధాన ప్రశ్న. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే పలుమార్లు అరవింద్ కుమార్ ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా నాటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే నిధుల విడుదల జరిగిందని.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలో దెబ్బ తినకూడదన్న ఉద్దేశంతోనే అలా చేసినట్లుగా అరవింద్ కుమార్ వాంగ్మూలాన్ని ఇచ్చినట్లు చెబుతారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసి.. విచారణ చేపట్టనున్నారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసేలా పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. ఇదే జరిగితే.. రానున్న రోజుల్లో కేటీఆర్ కు మరో కష్టం రెఢీగా ఉన్నట్లే.

Tags:    

Similar News