కోమటిరెడ్డి యూటర్న్.. పవన్ పై విమర్శలపై ఆసక్తికర వివరణ
హైదరాబాదులో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించేందుకు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి కోమటిరెడ్డి వచ్చారు.;
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యూటర్న్ తీసుకున్నారా? ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై ఇటీవల తీవ్ర విమర్శలకు దిగిన మంత్రి కోమటిరెడ్డి శుక్రవారం రాజధాని అమరావతికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితుల మేరకు పవన్ పై విమర్శలు చేయాల్సివచ్చిందంటూ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కి తగినట్లు అమరావతి ప్చూచరిస్టిక్ క్యాపిటల్ గా అభివృద్ధి చెందుతోందని అన్నారు.
హైదరాబాదులో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించేందుకు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి కోమటిరెడ్డి వచ్చారు. చంద్రబాబు విజన్ 2020 అభివృద్దికి ప్రతిరూపం హైదరాబాద్ అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రిపై చేసిన విమర్శలకు వివరణ ఇస్తూ అప్పటి పరిస్థితుల మేరకు ఆ వ్యాఖ్యలు చేశానంటూ స్పష్టం చేశారు. ఇప్పుడు చంద్రబాబును ఆహ్వానించడానికి వచ్చా.. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి. అదే స్నేహం కొనసాగాలి అంటూ అభిప్రాయపడ్డారు.
ఇక గత నెల 26న పవన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారానికి దారితీశాయి. కోనసీమ అందాలు గొప్పగా ఉంటాయని తెలంగాణ నేతలు తనతో అనేవారని, బహుశా వారి దిష్టి తగలడం వల్లే కొబ్బరి అందాలు పోయాయని అనిపిస్తోందని పవన్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇలా పవన్ మాట్లాడిన రెండు రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలకు దిగడంతో రాజకీయ రచ్చ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ ఎపిసోడులోకి ఎంటరైన కాంగ్రెస్ మంత్రులు ఏపీ ఉప ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలతో రచ్చ రచ్చ చేశారు.
ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి చేసిన విమర్శలు తీవ్ర దుమారానికి తెరతీశాయి. పవన్ క్షమాపణలు చెప్పకపోతే ఆయన సినిమాలను తెలంగాణలో ఆడనిచ్చేది లేదంటూ మంత్రి కోమటిరెడ్డి వార్నింగ్ ఇవ్వడంపై తీవ్ర చర్చ జరిగింది. ఆయన హెచ్చరికలపై పవన్ అభిమానులు ఘాటుగా స్పందించారు. మంత్రిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలకు తెరలేపారు. ఇలా పవన్ అభిమానులు వర్సెస్ కాంగ్రెస్ మంత్రులుగా సాగుతున్న వివాదం ఎటు దారితీస్తుందోనని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి కోటమిరెడ్డి తాజా వ్యాఖ్యలతో అంతా గప్ చుప్ అయినట్లేనని అంటున్నారు.