మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రినవుతా !

రాజకీయాల్లో పరమ పద సోపానంగా సీఎం సీటునే అంతా ఆశిస్తారు. దానికి ముందు మంత్రిగా చేయాలని అనుభవం పండాలని గతంలో అంతా అనుకునేవారు.;

Update: 2026-02-13 18:40 GMT

రాజకీయాల్లో పరమ పద సోపానంగా సీఎం సీటునే అంతా ఆశిస్తారు. దానికి ముందు మంత్రిగా చేయాలని అనుభవం పండాలని గతంలో అంతా అనుకునేవారు. ఆ విధంగానే ఒక్కో మెట్టూ ఎక్కుతూ ముఖ్యమంత్రి పదవికి చేరుకునేవారు. ఇటీవల కాలంలో ట్రెండ్ మారింది. మంత్రి కాకుండానే సీఎం అవుతున్నారు అది దేశమంతా చాలా చోట్ల సాగుతోంది. అందుకేనేమో నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా సీఎం సీటుకే టార్గెట్ పెట్టేశారు.

మంత్రి ఇస్తారా అంటూ :

ఒప్పందం ప్రకారం తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మంత్రి పదవి ఇస్తే ఇవ్వండి అంటూ నలభై అయిదు రోజుల డెడ్ లైన్ పెట్టారు. మునుగోడు ప్రజల ఆశీస్సులతో పెద్ద పదవి తనకు దక్కుతుందని ఆయన ధీమాగా చెప్పారు. నా కోసం మంత్రి పదవి కాదు, మీ కోసం అని ఆయన అన్నారు. మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి చేస్తారా మంత్రిగా చేయండి, ఒకవేళ కాకపోతే మన టార్గెట్ నేరుగా ముఖ్యమంత్రి పదవికే అని కోమటిరెడ్డి తన మనసులోని మాటను చెప్పేశారు. మునుగోడు మీరు చూసుకోండి, తెలంగాణాను నేను చూసుకుంటాను అని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్వీప్ చేసిన కాంగ్రెస్ :

నల్గొండ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అన్న మాట ఉంది. ఇక తాజాగా మునిసిపల్ ఎన్నికల పోరులో కాంగ్రెస్ అన్ని సీట్లూ గెలిచి జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ఈ సందర్భంగా జరిగిన విజయోత్సవ సంబరాలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావోద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి కూడా పార్టీ క్యాడర్ తో పంచుకున్నారు. మీరంతా తమ్ముళ్ళు అంటూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ఆయన చేసిన ప్రసంగంలో మంత్రి పదవి ఇవ్వకపోతే ఇక తన వ్యూహమేంటో చూపిస్తాను అన్నట్లుగానే ఉంది.

సాధ్యమవుతుందా :

ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. ఆయనను తీసి తమ్ముడికి మంత్రి పదవి ఇవ్వవచ్చు. కానీ అపుడు వెంకటరెడ్డితో సమస్య వస్తుంది అని అంటున్నారు అలాగని ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవులు ఇస్తే సామాజిక సమీకరణలతో పాటు పార్టీలో వర్గ పోరు కూడా పెరుగుతుందని అంటున్నారు. ఇదే నల్గొండ జిల్లా నుంచి ఉత్తం కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయన నుంచి వ్యతిరేకత వస్తుందని అంటున్నారు.

ఇచ్చిన మాట ప్రకారం :

అయితే కాంగ్రెస్ లోకి తిరిగి తనను ఆహ్వాంచిన సందర్భంగా మంత్రి పదవి హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాల్సిందే అన్నది ఆయన డిమాండ్. ఇది న్యాయమైనదే అని అంటున్నారు. పైగా రెండేళ్ళకు పైగా పాలన ముగిసింది దాంతో రాజ గోపాల్ రెడ్డి మంత్రి కావాలని కోరుకుంటున్నారు. అది నెరవేరకపోతే ముఖ్యమంత్రిని అవుతాను అని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయి. విజయోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పెద్దలకు రాజ గోపాల్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ కొంత ఆలోచనలో పడేసేలా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News