సిక్కోలు మేజర్ కు అత్యున్నత సైనిక పురస్కారం
శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రామగోపాలనాయుడు మేజరుగా పనిచేయడమే కాకుండా, విధి నిర్వహణలో గొప్ప ధైర్యసాహసాలు చూపినందుకు గాను కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు.;
దేశంలోనే రెండో అత్యున్నత సైనిక పురస్కారం కీర్తి చక్ర శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ మళ్ల రామగోపాలనాయుడును వరించింది. గురవారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మేజర్ రామగోపాలనాయుడికి కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రామగోపాలనాయుడు మేజరుగా పనిచేయడమే కాకుండా, విధి నిర్వహణలో గొప్ప ధైర్యసాహసాలు చూపినందుకు గాను కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంట అనే చిన్న గ్రామం మేజర్ మళ్ల రామగోపాలనాయుడు స్వస్థలం. 56 రాష్ట్రీయ రైఫిల్స్ లో మేజర్ గా పనిచేస్తున్న రామగోపాలనాయుడు 2023లో జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఐదుగురు ఉగ్రవాదులను తుదముట్టించడంలో చూపిన ధైర్యసాహసాలకు ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది. 2023 అక్టోబరు 26న కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద గస్తీ నిర్వహిస్తున్న పెట్రోలింగ్ టీమ్ లీడరుగా మేజర్ మల్ల రామగోపాలనాయుడు వ్యవహరించారు. ఆ సమయంలో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మేజర్ రామగోపాలనాయుడు ఉగ్రవాదులను పట్టుకునేందుకు మన జావాన్లకు మార్గ నిర్దేశం చేశారు.
ఉగ్రవాదులు పెద్ద పెద్ద రాళ్ల వెనకి నక్కి గ్రెనేడ్లు విసురుతూ, మన జవాన్లపై కాల్పులు జరిపారు. ఆ సమయంలో పెట్రోలింగ్ టీం లీడరుగా వ్యవహరించిన రామగోపాలనాయుడు అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి ఉగ్రవాదుల తూటాలకు ఎదురెల్లి వారిని మట్టుబెట్టారు. ఆ సమయంలో ఆయన చూపిన తెగువతో మన జవాన్లను కాపాడుకోవడమే కాకుండా దేశాన్ని రక్షించారని అభినందనలు వెళ్లువెత్తాయి. మరోవైపు మేజర్ రామగోపాలనాయుడు సాహసాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక చేసింది.
ఇక భారత నౌకాదళంలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఆఫీసర్ గా విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్ కమాండెంట్ కపిల్ యాదవ్ ను శౌర్యచక్ర పురస్కారం వరించింది. 2024 జనవరి 26న ఒక ఇంధన నౌకలో మంటలు ఎగసిపడుతున్నా లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి మంటలను అదుపు చేశారు కపిల్ యాదవ్. నౌకకు ఆక్సిజన్ సరఫరా నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చి విలువైన ప్రాణాలు కాపాడారు. కపిల్ యాదవ్ ధైర్య సాహసాలను మెచ్చిన కేంద్రం శౌర్య చక్ర పురస్కారం ప్రదానం చేసింది.