వారసుడి కోసం ఖమేనీ కసరత్తులు.. ట్విస్ట్ ఏమిటంటే..?
ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ రక్షణ రంగానికి చెందిన పలువురు కీలక నేతలను పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.;
ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ రక్షణ రంగానికి చెందిన పలువురు కీలక నేతలను పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. వారి వారి స్థానాల్లో కొత్తవారిని నియమిస్తున్నారు ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ. అయితే.. తన అనంతరం ఆ స్థానంలో ఎవరు ఉండాలనే విషయంపై కూడా తాజాగా కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ ట్విస్ట్ నెలకొంది.
అవును... ఇజ్రాయెల్ తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ.. తన వారసుడి కోసం కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తనను ఐడీఎఫ్ దళాలు హతమారుస్తాయనే ఆందోళనలో ఖమేనీ ఉన్నారని.. ఈ నేపథ్యంలోనే ఈ చర్యకు ఉపక్రమించారని చెబుతున్నారు. ఈ సమయంలో ముగ్గురి పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
వాస్తవానికి కొన్ని రోజుల క్రితమే ఖమేనీ వారసుడి గురించి చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఖమేనీ కుమారుడు మొజ్తాబా పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. తన తదనంతరం ఆ స్థానంలో తన బయలాజికల్ వారసుడినే పెట్టనున్నారని కథనాలొచ్చాయి. అయితే.. తాజాగా ఖమేనీ పరిశీలిస్తున్న ముగ్గురి పేర్లలో.. మొజ్తాబా లేకపోవడం గమనార్హం.
ఈ సందర్భంగా... ఐడీఎఫ్ కానీ, అమెరికా సైన్యం కానీ తనను హతమార్చే అవకాశం ఉందని 86 ఏళ్ల ఖమేనీకి తెలుసునని ఇరాన్ అధికారులు చెబుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ తదుపరి అత్యున్నత నాయకుడిని ఎన్నుకునే నిపుణుల సభను వేగంగా వ్యవహరించాలని, తాను ప్రతిపాదించిన మూడు పేర్ల నుంచి వారసుడిని ఎన్నుకోవాలని ఖమేనీ ఆదేశించారని అంటున్నారు.
కొత్త అధినాయకుడిని నియమించే ప్రక్రియకు సాధారణ పరిస్థితుల్లో అయితే నెలల తరబడి సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో.. ఇస్లామిక్ రిపబ్లిక్, అతని వారసత్వం రెండింటినీ రక్షించడానికి ఖమేనీ వేగవంతమైన చర్యలకు ఉపక్రమిస్తున్నారని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.
కాగా... ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమొందిస్తే యుద్ధం ముగిసినట్లేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించగా... సోకాల్డ్ సుప్రీం లీడర్ ఎక్కడ ఉన్నారో తమకు తెలుసని, ఆయనను చంపడం తమకు పెద్ద విషయం కాదని, అయితే ఇప్పుడే చంపాలనుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఖమేనీ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు!