బెజవాడ హీట్‌.. ఇక అన్నదమ్ముల వార్‌!

ఈ మేరకు ఇప్పటికే వైసీపీ తరఫున కేశినేని నాని టికెట్‌ దక్కించుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన సోదరుడు కేశినేని చిన్నికి టీ డీపీ టికెట్‌ ప్రకటించింది

Update: 2024-03-22 13:30 GMT

వేసవి కాలం ఇంకా పూర్తి స్థాయిలో రాకముందే విజయవాడ హీటెక్కింది. విజయవాడ పార్లమెంటు స్థానంలో గెలుపు కోసం ఇద్దరు అన్నదమ్ములు కొదమ సింహాల్లా తలపడుతున్నారు. అధికార వైసీపీ తరఫున ప్రస్తుత టీడీపీ సిట్టింగ్‌ ఎంపీ కేశినేని నాని, టీడీపీ తరఫున కేశినేని నాని తమ్ముడు కేశినాని శివనాథ్‌ (చిన్ని) నువ్వా, నేనా అనే రీతిలో తలపడుతున్నారు.

ఈ మేరకు ఇప్పటికే వైసీపీ తరఫున కేశినేని నాని టికెట్‌ దక్కించుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన సోదరుడు కేశినేని చిన్నికి టీడీపీ టికెట్‌ ప్రకటించింది. దీంతో విజయవాడ లోక్‌ సభా నియోజకవర్గంలో అన్నదమ్ముల మధ్య సంకుల సమరం జరగనుంది.

2014, 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా టీడీపీ తరఫున కేశినేని నాని గెలుపొందారు. 2019లో గెలిచిన తర్వాత నుంచి టీడీపీ అధిష్టానంపై సోషల్‌ మీడియా వేదికగా నాని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలోనూ ఆయనకు బొకే ఇవ్వడానికి నిరాకరించి నాని కలకలం రేపారు. నిత్యం సోషల్‌ మీడియా వేదికగా టీడీపీ అధిష్టానంపైన, స్థానిక టీడీపీ నేతలపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.

అయితే టీడీపీ, జనసేన పొత్తు కుదిరాక కేశినేని నాని తన దూకుడు తగ్గించి టీడీపీ అధినేత చంద్రబాబుకు దగ్గరయ్యే పనులు మొదలుపెట్టారు. అయితే గెలిచిన దగ్గర నుంచి చివరి వరకు అసమ్మతివాదిగా వ్యవహరిస్తూ వచ్చిన కేశినేని నానిని చంద్రబాబు పక్కనపెట్టారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వబోమని స్వయంగా ఆయనకు తెలిపారు. దీంతో అగ్గిమీద గుగ్గిలమైన కేశినేని నానిని వైసీపీ నేతలు సంప్రదించడంతో ఆయన ఆ పార్టీలో చేరిపోయారు. అంతేకాకుండా పార్టీలో చేరిన రోజే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నానిని వైసీపీ అధినేత జగన్‌ ప్రకటించారు.

మరోవైపు కేశినేని నాని గత ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి తేడాగా వ్యవహరిస్తుండటంతో చంద్రబాబు ఆయన సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తూ వచ్చారు. విజయవాడ లోక్‌ సభా నియోజకవర్గంలో కేశినేని చిన్ని చురుగ్గా తిరగడం మొదలుపెట్టారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలను, కార్యకర్తలను కలుస్తూ కేశినేని చిన్ని బలమైన నెట్‌ వర్క్‌ ను ఏర్పాటు చేసుకున్నారు.

ఇందుకు తగ్గట్టే కేశినేని చిన్నిని విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్‌ సభా నియోజకవర్గంలో అన్నదమ్ముల వార్‌ జరగనుంది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య గతం నుంచే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్నికల పోటీ కూడా నెలకొనడంతో ఇద్దరు అన్నదమ్ములు తమ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News