డ్రాగన్ దేశానికి కొత్త శాపం.. భారీగా తగ్గిన దేశ జనాభా

సమస్యల్ని సృష్టించే విషయంలో చైనాకున్న ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.;

Update: 2026-01-20 10:30 GMT

సమస్యల్ని సృష్టించే విషయంలో చైనాకున్న ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగమొండి డ్రాగన్ దేశానికి ఇప్పుడో కొత్త సంక్షోభం వచ్చి పడింది. గడిచిన కొద్ది కాలంగా జనాభాలో తగ్గుదల నమోదు కావటం తెలిసిందే. కానీ.. ఇప్పుడది సంక్షోభ స్థాయికి చేరిందని చెబుతున్నారు. గడిచిన ఏడాది వ్యవధిలో ఆ దేశంలో తగ్గిన జనాభా భారీగా ఉండటమేకాదు.. ఇదే రీతిలో కొనసాగితే.. రానున్న రోజుల్లో కొత్త సంక్షోభానికి కారణమవుతుందన్న ఆందోళన మొదలైంది.

ఏడాది కాలంలో చైనా దేశ జనాభా 33.9 లక్షల మేర తగ్గి 140.4 కోట్లకు పరిమితమైంది. 2025లో దేశంలో జననాల రేటు ఏకంగా 17 శాతం పడిపోయింది.. జననాల సంఖ్య కేవలం 79.2 లక్షలుగా నమోదైంది. అంతకు ముందు ఏడాది (2024)తో పోలిస్తే 16.2 లక్షల మేర తగ్గింది. అదే సమయంలో మరణాల రేటు అంతకంతకూ పెరుగుతోంది. 2025లో చైనాలో మరణాల సంఖ్య 1.13 కోట్లుగా నమోదైంది.

ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. గడిచిన యాభై ఏళ్లలో అత్యధిక మరణాలు నమోదైన సంవత్సరం ఇదేనని చెబుతున్నారు. ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే.. ఇంత భారీగా జనాభా తగ్గిన ఏకైక దేశంగా చైనా నిలిచింది. జీవన శైలి వ్యయం భారీగా పెరగటంతో.. పిల్లల్ని కనటం.. వారి బాగోగులు చూసే విషయంలో ఆసక్తి తగ్గిందని.. పిల్లల్ని కనే విషయంలో చైనీయులు తెగ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. దేశ యువతలో వచ్చిన మార్పును గుర్తించిన చైనా ప్రభుత్వం.. ఈ వైఖరి మార్పు కోసం పలు ప్రోత్సహకాల్ని ప్రకటిస్తున్నా.. పరిస్థితుల్లో మాత్రం మార్పులు రావట్లేదంటున్నారు.

తాజాగా గుర్తించిన గణాంకాల నేపథ్యంలో.. ఇదే తీరులో రాబోయే సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంటే 2100 నాటికి చైనా జనాభా 63.3 కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్యసమితి ఆర్థిక.. సామాజిక వ్యవహారాల విభాగం అంచనా వేసింది. దశాబ్దాల తరబడి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగటం తెలిసిందే. అయితే.. ఈ రికార్డును 2023లో భారత్ బ్రేక్ చేయటం తెలిసిందే. అప్పటి నుంచి చైనాలో జనాబా తగ్గుదల అంతకంతకూ ఎక్కువ అవుతోంది. పెరిగిన జీవన వ్యయం నేపథ్యంలో వీలైనంతవరకు సింగిల్ గా ఉండేందుకు చైనీయులు ఆసక్తిని చూపుతున్నట్లుగా చెబుతున్నారు.

ఈ కారణంగానే గడిచిన కొంతకాలంగా దేశంలో పెళ్లిళ్ల సంఖ్యలోనూ భారీ తగ్గుదల నమోదవుతోంది. 2024లో దేశ వ్యాప్తంగా జరిగిన పెళ్లిళ్లు కేవలం 61 లక్షలు మాత్రమేనని.. 2023తో పోలిస్తే ఏకంగా 20 శాతం పెళ్లిళ్ల సంఖ్య తగ్గినట్లుగా లెక్కలేస్తున్నారు. గడిచిన 45 ఏళ్లలో అత్యల్ప పెళ్లిళ్లు ఇవేనని.. గడిచిన పదేళ్లలో ఇలాంటి పరిస్థితే ఉందంటున్నారు. కాస్తంత ఉపశమనం ఏమంటే.. 2025లో మాత్రం పెళ్లిళ్ల సంఖ్య 8.5 శాతం పెరిగినట్లుగా చెబుతున్నారు.

ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని చైనీయులు చెబుతున్నారు 2025లో జనాభా భారీగా తగ్గడానికి మరో కీలక కారణం ఉందంటున్నారు. చైనీయుల క్యాలెండర్ ప్రకారం 2025ను వుడ్ స్నేక్ నామ సంవత్సరంగా వ్యవహరించారు. పాము పేరిట వచ్చే సంవత్సరంలో పిల్లల్ని అస్సలు కనకూడదని.. ఇదే మాత్రం అనువైనది కాదన్నది చైనీయుల నమ్మకం. ఈ కారణంగానే 2025లో చైనాలో జననాల సంఖ్య భారీగా తగ్గటానికి ఇదో కారణంగా చెబుతున్నారు. చైనాలో సంవత్సరాలకు జంతువుల పేర్లు పెట్టటం వేలాది ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం.

ఇదిలా ఉండగా చైనాకుమరో సమస్య పట్టి పీడిస్తోంది. ఈ దేశంలో పెద్ద వయస్కుల జనాభా పెరుగుతోంది. ప్రస్తుతం ఆ దేశంలో పెద్ద వయస్కుల వారి సంఖ్య 32.3 కోట్లుగా చెబుతున్నారు. అంటే.. మొత్తం జనాభాలో 23 శాతంగా చెప్పొచ్చు. 2035 నాటికి చైనాలో పెద్ద వయస్కుల జనాభా 40కోట్లకు దాటుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలో జనాభా సంఖ్య పెంచేందుకు చైనా ప్రభుత్వం కండోమ్ ధరల్ని పెంచేసింది. అలా చేస్తే.. వాటి వినియోగం తగ్గుతుందని ఆశించారు. కానీ.. ఈ నిర్ణయం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని చెబుతున్నారు. చైనా జనాబా పెరగాలంటే ఆ దేశ మహిళల సగటు సంతాన సాఫల్య రేటు కనీసం 2.1.. లేదంటే అంతుకు మించి ఉండాలని అంచనా వేస్తున్నారు. పిల్లల్ని అదే పనిగా కనే పరిస్థితి నుంచి ఆచితూచి మాత్రమే కనాలన్న ఆలోచన కలిగించిన ప్రభుత్వం.. పిల్లల విషయంలో ప్రజల మైండ్ సెట్ ఎలా మారుస్తుందన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.

Tags:    

Similar News